ఏపీలో సీనియర్ నేతలు వలసబాట పడుతున్నారు. ఎన్నికలకు ఏడాది సమయం మాత్రమే ఉన్నందున ఏపీలో వలసలు ఊపందుకున్నాయి. తాజాగా ఈనెల 8వ తేదీ విశాఖ జిల్లాలో జరుగుతున్న వైసీపీ అధినేత జగన్ పాదయాత్రలో ఆపార్టీలో చేరుతున్నట్లు మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి తనయుడు రామ్‌కుమార్‌రెడ్డి మంగళవారం వెల్లడించారు. వాకాడులోని నేదురుమల్లి నివాసంలో గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాలకు చెందిన పలువురు నాయకులతో ఆయన సమావేశమయ్యారు. రెండు రోజులుగా వెంకటగిరి, నెల్లూరు పట్టణాల్లోనూ ఆయన చేరికపై సమావేశాలు జరిగాయి. ఇటీవల ఆయన బీజేపీ వీడుతూ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో వైసీపీ అధినేత జగన్‌ను కలిసి పార్టీలో చేరేందుకు ఆహ్వానం అందుకొని అనంతరం జిల్లాలోని నెల్లూరు, వెంకటగిరి, గూడూరు పట్టణాల్లో నేదురుమల్లి అభిమానులతో సమావేశాలు నిర్వహించి తర్వలో వైసీపీలో చేరే తేదీని ఖరారు చేస్తానని చెబుతూ వచ్చారు. ఆ తరుణంలో ఆయన వాకాడులో నాయకులతో సమావేశమై తేదీని ప్రకటించారు. వాకాడులో జరిగిన సమావేశంలో వాకాడు సొసైటీ అధ్యక్షుడు కొడవలూరు దామోదర్‌రెడ్డి, నేదురుమల్లి హిమకుమార్‌రెడ్డి, వైకాపా నాయకులు దశరధరామిరెడ్డి, చంద్రారెడ్డి, మాజీ ఎంపీపీ మధుసూధన్‌రెడ్డి, మాజీ సర్పంచులు, గూడూరు నాయకులు కోడూరు మీరారెడ్డి, సైదాపురం నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం రామ్‌కుమార్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ విశాఖ జిల్లాలో జరుగుతున్న పాదయాత్రలో జగన్ సమక్షంలో ఆపార్టీలో చేరుతున్నానని చెప్పారు. ఈక్రమంలో నాయకులతో సమావేశమయ్యానని తెలిపారు.