భీకరమైన వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతున్న కేరళను ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తనవంతుగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే ఆర్థిక, ఆహార సంబంధమైన సహాయం చేసిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేరళ రాష్ట్రంలో జీవాల కోసం 100 టన్నుల పశువుల దాణా, ఒక లక్ష 25 వేల డోసుల వ్యాక్సిన్ పంపించాలని నిర్ణయించుకుంది. దీంతో పాటుగా కేరళకు 500 మెట్రిక్ టన్నుల బియ్యం పంపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పౌరసరఫరాల శాఖా మంత్రి ఈటల రాజేందర్‌ను ఆదేశించారు. కేరళకు తెలంగాణ ప్రభుత్వ సాయం పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్‌తో మంత్రి ఈటల మాట్లాడారు. వెంటనే బియ్యం పంపించే ఏర్పాటు చేయాలనీ మంత్రి ఈటల కోరారు.
మరోవైపు కేరళ రాష్ట్రంలో జీవాల కోసం 100 టన్నుల పశువుల దాణా, ఒక లక్ష 25 వేల డోసుల వ్యాక్సిన్ తీసుకెళ్లే వాహనాలను సచివాలయం వద్ద జెండా ఊపి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. కేరళ రాష్ట్రంలో జీవాలకు దాణా కొరతను దృష్టిలో ఉంచుకుని దాణా సరఫరా చేయాలని నిర్ణయించామన్నారు. ఇప్పటికే 20 టన్నుల పాల పొడిని కేరళకు పంపించామని, కేరళ రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ఎలాంటి సహాయ సహకారాలు అవసరమైన అందిస్తామని హామీ ఇచ్చారు. కోళ్ళ ఉత్పత్తి దారుల సమాఖ్య 20 లక్షల రూపాయలను అందించిందని, చిత్ర పరిశ్రమ కు చెందిన అనేక మంది ఆర్ధిక సహాయం అందించారు.. .. ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న కేరళ ప్రజలకు అందరూ అండగా నిలవాలని కోరారు.