భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి విశాఖతో మధురానుబంధం ఉంది. విశాఖపై ఆయన ప్రత్యేక అభిమానం ఉండటంతో రావడానికి ఆసక్తి చూపేవారు. విశాఖకు జాతీయ స్థాయిలో ఖ్యాతిని తెచ్చిపెట్టిన స్టీల్‌ప్లాంట్, విశాఖ పోర్టు, ఆంధ్ర విశ్వవిద్యాలయాల అభివృద్ధి, మనుగడకు ఆయన ఎంతో కృషి చేశారు. వాజ్‌పేయి ప్రధాని హోదాతో పాటు వివిధ హోదాల్లో పలుసార్లు వైజాగ్ వచ్చారు. ఇక్కడ కార్యక్రమాలు, ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు.
విశాఖతో మధురానుబంధం
♦ వాజ్‌పేయి తొలిసారి ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధించడానికి ముందు 1977లో ఆయన జన్‌సంఘ్ పార్టీ నాయకుని హోదాలో విశాఖలో అడుగుపెట్టారు.
♦ 1980లో బీజేపీ ఏర్పాటయ్యాక ఆయన 1982లో విశాఖ వచ్చారు.
♦ 1981లో జరిగిన ఎన్నికలలో విశాఖ మున్సిపాలిటీలో 50 వార్డులకు గాను బీజేపీ 25వార్డులలో విజయభేరి మోగించింది. ఫలితంగా విశాఖ తొలి మేయర్‌గా ఎన్ఎస్ఎన్ రెడ్డి ఎన్నికయ్యారు. వాజ్‌పేయి అప్పట్లో బీజేపీ మేయర్ ఎన్నికల విజయోత్సవ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు వన్‌టౌన్‌లోని ప్రస్తుత జీవీఎంసీ స్టేడియం ఉన్న స్థలంలో పౌరసన్మానం చేశారు.
♦ 1983లో మరోసారి విశాఖ వచ్చారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో పార్టీ తరపున ప్రచారం చేశారు.
♦ 1997లో విశాఖ మేయర్ ఎన్నికల సమయంలో విశాఖ వచ్చారు. ఎన్నికల ప్రచారం చేసి వెళ్లారు.
♦ వాజ్‌పేయికి 1988లో షíష్టిపూర్తి సందర్భంగా ఏయూ కాన్వొకేష¯Œన్ హాలులో ఘన సన్మానం చేశారు. వాజ్‌పేయి 1993లో భారత్ పరిక్రమ్ యాత్ర సందర్భంగా విశాఖ వచ్చారు. అప్పటి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ప్రస్తుత అధికార ప్రతినిధి పృథ్వారాజ్ ఆయనను కలుసుకున్నారు.
♦ 1998 సార్వత్రిక ఎన్నికల సమయంలో డీవీ సుబ్బారావు విశాఖ ఎంపీగా, పీవీ చలపతిరావు అనకాపల్లి ఎంపీగా బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేశారు. వీరిద్దరి తరపునా ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
♦ 2004 ఎన్నికల సమయంలో కె. హరిబాబు వన్‌టౌన్ ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎంవీవీఎస్ మూర్తి పోటీ చేశారు. అప్పట్లో టీడీపీ–బీజేపీ పొత్తు కారణంగా ఇరు పార్టీల అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం చేశారు.