కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటనపై మంత్రి కేటీఆర్ అదిరిపోయే పంచ్ వేశారు. రాహుల్ రాక సందర్భంగా కాంగ్రెస్ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూనే..కలల్లో తేలిపోతున్న ఆ పార్టీ నేతలకు మైండ్ బ్లాంకయ్యే కామెంట్లు చేశారు.బుధవారం మంత్రి కేటీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా సిరిసిల్లలోని గీతా నగర్లో ఉన్న నెహ్రూ పార్క్‌ను ప్రారంభించారు. నెహ్రూ పార్క్‌లో కొన్ని నిర్మాణాలు చేపట్టి అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. అనంతరం కరీంనగర్‌లోని ఎలగండల్ క్రాస్ రోడ్ వద్ద కరీంనగర్ నుంచి కామారెడ్డి వరకు నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, బోడిగ శోభ తదితరులు పాల్గొన్నారు. తర్వాత కరీంనగర్లో ఐటీ టవర్ నిర్మాణ పనులను పరిశీలించారు.
అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ నాలుగేళ్లుగా రాని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఓట్ల కోసం వస్తున్నారని స్పష్టం చేశారు. “రాహుల్ గాంధీ ఇక్కడ ఏం చేస్తారు? సొంత మున్సిపాలిటీని కూడా రాహుల్ గెలిపించుకోలేకపోయారు. రాహుల్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ కాంగ్రెస్ నాశనం. తెలంగాణలోనూ కాంగ్రెస్ ఓడిపోతుంది“ అని తేల్చిచెప్పారు. 56 ఏళ్లలో సాధించని అభివృద్ధిని నాలుగేళ్లలో సాధించామని మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు. “అభివృద్ధిని చూసి ఓర్వలేని పార్టీలు అనవసర విమర్శలు చేస్తున్నాయి. కరీంనగర్లో వందల కోట్లతో అతి వేగంగా పనులు సాగుతున్నాయి. కరీంనగర్లో అండర్ గ్రౌండ్ పనులను మేమే కొలిక్కి తెచ్చాం. చరిత్రలో ఎన్నడూ లేనన్ని నిధులు కరీంనగర్‌కు ఇచ్చిన మాట నిజం కాదా?” అని మంత్రి నిలదీశారు.
రాష్ట్రంలో తాము చేస్తున్న అభివృద్ధిని కాంగ్రెస్ నేతల కళ్లకు కనిపించడం లేదా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. అలాంటి పరిస్థితి ఉంటే…కంటివెలుగు పథకం కింద పరీక్ష చేయించుకోవాలని మంత్రి ఎద్దేవా చేశారు.