ఏపీలో అవినీతి, అరాచకపాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. అయితే, వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర నేటితో విశాఖ జిల్లాలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
గత ఏడాది నవంబర్ 6న వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో మొదలైన పాదయాత్ర ఇప్పటి వరకు పది జిల్లాల్లో పూర్తి చేసుకుంది. నేడు ఉత్తరాంధ్ర ముఖ ద్వారమైన విశాఖ జిల్లాలోని నర్సీపట్నం నియోజకవర్గం గన్నవరం మెట్ట వద్ద వైఎస్ జగన్ విశాఖ జిల్లాలోకి అడుగు పెట్టారు. ఇటు తూర్పు గోదావరి జిల్లా వాసులు వైఎస్ జగన్‌కు ఘనంగా వీడ్కోలు చెప్పగా అటు విశాఖ జిల్లా ప్రజలు వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం పలికారు.
విశాఖ జిల్లాలో సుమారు నెల రోజులపాటు ప్రజా సంకల్ప యాత్ర కొనసాగనుంది. మొత్తం 15 నియోజకవర్గాలు ఉండగా.. 13 నియోజకవర్గాల్లో వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగనుంది. నాలుగు ఆత్మీయ సమ్మేళనాలు, ఏడు బహిరంగ సభల్లో వైఎస్ జగన్ ప్రసంగిస్తారు.