`స్థానిక సంస్థలు ప్రధానంగా మున్సిపల్ కార్పొరేషన్లు బాండ్ల రూపంలో నిధులను సేకరించుకోవాలి. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక చొరవ చూపించాలి“ అని దేశ ప్రధాని నరేంద్రమోడి హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చినప్పుడు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావుకు సూచించారు. ప్రధాని సలహామేరకు బాండ్ల ద్వారా నిధులను సేకరించాలని మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ దాదాపు వెయ్యి కోట్ల రూపాయలను సేకరిస్తోంది. ఇప్పటి వరకు కేవలం పూణె మున్సిపాలిటీ అనంతరం జీహెచ్ఎంసీ మాత్రమే బాండ్ల ద్వారా నిధులను సేకరించింది. అయితే పూణె బాండ్ల ద్వారా పూర్తిస్థాయిలో నిధులను సేకరించడంలో విఫలమైంది. జీహెచ్ఎంసీకి ఉన్న పటిష్టమైన ఆర్థిక వనరులు, ఆర్థిక క్రమశిక్షణ, ఆస్తుల నేపథ్యంలో లక్ష్యాన్ని మించి వెయ్యికోట్ల నిధులను బాండ్ల రూపంలో ఇవ్వడానికి ముంబాయి స్టాక్ ఎక్చేంజ్‌లో పలు ఆర్థిక సంస్థలు పోటీపడ్డాయి.
గ్రేటర్ హైదరాబాద్‌లో చేపట్టిన ఎస్.ఆర్.డి.పి, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ వ్యయాలకు మాత్రమే ఈ బాండ్ల నిధులను వెచ్చిస్తున్నారు. జీహెచ్ఎంసీ విజయవంతంగా సేకరించిన బాండ్ల నిధులు దేశవ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లకు మార్గదర్శకంగా నిలిచింది. ఇదే విషయాన్ని నేడు ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో నగరంలో ప్రారంభమైన ట్రాన్స్ఫార్మింగ్ అర్భన్ ల్యాండ్ స్కేపింగ్ అనే అంశంపై రెండు రోజుల సదస్సు సమావేశంలో ప్రసంగించిన కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ది శాఖ మంత్రి హరిందర్పూరి పేర్కొన్నారు. ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా జీహెచ్ఎంసీ బాండ్లను ప్రశంసించారు. ప్రజలపై ఏవిధమైన పన్నుల భారం వేయకుండా కేవలం వ్యవస్థాపరమైన లొసుగులను సరిదిద్దుకోవడం, ఐటి ఆధారిత సేవలను పటిష్టంగా ఉపయోగించుకోవడం ద్వారానే పన్నుల ద్వారా అధిక మొత్తంలో నిధులను జీహెచ్ఎంసీ సేకరిస్తోంది. సవాలుతో కూడుకున్న నగర నిర్వహణ మున్సిపల్ కార్పొరేషన్లు చేపట్టే స్వచ్ఛ కార్యక్రమాలలో నగర ప్రజల భాగస్వామ్యం పటిష్టంగా కల్పించినప్పుడే వాటి అమలు పకడ్బందీగా అవుతాయని జీహెచ్ఎంసీ భావిస్తోంది.
బాండ్ల సేకరణకు గుర్తింపుగా కేంద్రం అందించిన ఈ ఇన్సెంటీవ్ దేశంలోనే ఇతర మున్సిపాలిటీలకు ఆదర్శంగా ఉండాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు పలు మున్సిపాలిటీలు బాండ్ల సేకరణకు ప్రయత్నిస్తున్నారు. ఈ సంవత్సరం ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా బాండ్ల రూపంలో నిధులను సేకరిస్తోంది.