గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడి నుంచి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రజలు గత ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టారు. అయితే, మొదట్లో బాగానే ఉన్నా రాను.. రాను ప్రత్తిపాటి పుల్లారావు, ఆయన ఫ్యామిలీ రాజకీయాలు పెరిగిపోయాయి. తన నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించమని వచ్చిన ప్రతీ సామాన్య వ్యక్తి నుంచి ప్రభుత్వ అధికారి వరకు.. కమీషన్లు దండుకుంటున్నారనే వార్తలు గుప్పమన్నాయి.
ఈ పరిణామాలు చిలకలూరి పేట నియోజకవర్గంలో టీడీపీని మసకబారేలా చేశాయి. దీంతో గత ఏడాది జరిగిన మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి నుంచి తప్పించాలని సీఎం చంద్రబాబు చూసినా.. అనేక కారణాలతో కేవలం శాఖ మార్పుతో సరిపెట్టారు. అయినా కూడా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తన అవినీతి కార్యక్రమాలకు అడ్డుకట్టవేయలేదనే వార్తలు నేటికీ వస్తున్నాయి.
కానీ, వచ్చే ఎన్నికల్లో మాత్రం మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును ఓడించాలనే సంకల్పంతో చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలు ఉన్నారు. అయితే, ప్రత్తిపాటి పుల్లారావు వరుసగా రెండుసార్లు గెలవడం, ఆయన పనితీరుపై వ్యతిరేకత, ఆయన ఫ్యామిలీ మొత్తం ప్రజలపై పెత్తనం చేయడం, ప్రతీ దానికి ప్రత్తిపాటి సతీమణి రంగంలోకి రావడం వంటి వాటిపై ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తోంది.