ఏపీ ప్రభుత్వం కీలు బొమ్మగా మారింది. ఒక ఎమ్మెల్యే చేస్తున్న దందాను నిలువరించలేకపోయింది. అధికార అండతో ఖనిజ సంపదను అడ్డంగా దోచుకుంటుంటే.. యంత్రాంగం మౌనం దాల్చింది. విచారణకు ఆదేశించినా.. కాలు కదపని అధికారులపై హైకోర్టు కన్నెర్రజేసింది. రికవరీ ఎందుకు చేయలేదని మండిపడింది. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఏం చేశాడు..?
గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం కోనంకిలో సర్వే నెం.278/19బీలో 4.37 ఎకరాలు 279/30సీలో 189.31 ఎకరాలను సున్నపురాయి తవ్వకానికి అసోసియేటెడ్ సిమెంట్ కంపెనీ లిమిటెడ్ ఏసీసీకి 1959లో ప్రభుత్వం 20 ఏళ్లకు లీజుకు ఇచ్చింది. అదే రీతిలో పిడుగురాళ్లలో సర్వే నెం.892/49ఏ2లో 64.32ఎకరాలు, 892/4ఏలో 82 ఎకరాలు 1979లో అదే సంస్థకు లీజుకు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా కోనంకి, పిడుగురాళ్లలో 644.11 ఎకరాల్లో సున్నపురాయి నిక్షేపాలను ఏసీసీ సంస్థ లీజు రూపంలో పొందింది. కానీ, గిట్టుబాటు కాకపోవడంతో ఆ సంస్థ దానిని వదులుకుంది.
దీంతో ప్రభుత్వం 2000 సంవత్సరం సెప్టెంబర్ 22న మైనింగ్ లీజులన్నింటినీ రద్దు చేసింది. అయితే, దీన్ని ఆసరా చేసుకున్న గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమాలకు తెర తీశారు. పిడుగురాళ్ల, కోనంకిలోని సున్నపురాయి నిక్షేపాలను స్థానిక కూలీల ద్వారా అక్రమంగా తవ్వించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆయన అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. కోనంకి, పిడుగురాళ్ల, దాచేపల్లిలో తన ముఠాను మోహరించి సున్నపు రాయిని అనుమతులు లేకుండానే యథేచ్ఛగా తవ్వించేశారు. వందల కోట్ల రూపాయలను అక్రమంగా కొట్టేశారు. ప్రతీ నిత్యం వందల కొద్ది ట్రాక్టర్లు, లారీలలో ఈ సున్నపురాయి తరలిపోతోంది. ఇంత జరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం కిమ్మనడం లేదు. సైలెంట్‌గా చోద్యం చూస్తూ.. యరపతినేని ఇస్తున్న లంచాలను తీసుకుని ఆయనకు సహకరించారు.
అయితే, దీనిపై గతంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ నుంచి గనుల శాఖ వరకు ప్రతీ ఒక్కరికీ స్థానికులు భారీగా ఫిర్యాదులు చేశారు. అయినా ఫలితం లేదు. దీంతో స్థానికులు లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. స్పందించిన లోకాయుక్త అధికారుల చేత విచారణ చేయించింది. యరపతినేని వందల కోట్ల రూపాయల విలువ చేసే సున్నపురాయి నిక్షేపాలను తవ్వించారని నిర్ధారించింది. దాంతోపాటు యరపతినేని జరిపిన తవ్వకాలు నిజమేనని హైకోర్టు కూడా నిర్ధారించుకుంది. ఖనిజ సంపద తరలిపోకుండా చర్యలు తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్, ఎస్పీలను కూడా ఆదేశించింది. అయినా, వారు పట్టించుకోలేదు.
ఇదిలా ఉండగా, ఇదే విషయమై పిడుగురాళ్లకు చెందిన గురవాచారి అనే వ్యక్తి హైకోర్టులో ప్రజావాజ్యం దాఖలు చేశారు. తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని, సున్నపురాయి నిక్షేపాలను తవ్వేస్తూ.. వందల కోట్లరూపాయల సొమ్మును అక్రమంగా ఆర్జిస్తున్నారని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో కోట్లలో రావాల్సిన సొమ్మును టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని కొట్టేస్తున్నారని హైకోర్టు ప్రజావాజ్యంలో గురువాచారి పేర్కొన్నారు.
గురవాచారి ప్రజావాజ్యం మేరకు హైకోర్టులో కేసు విచారణకు రావడంతో జరుగుతున్న పరిణామాలు, గతంలో లోకాయుక్త ఇచ్చిన నివేదికలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమాలపై సీరియస్ అయింది. మైనింగ్‌కు పాల్పడిన యరపతినేని శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతోపాటు నిక్షేపాలు తవ్విన తవ్వకాలకు సంబంధించిన లెక్కలను తేల్చి.. రికవరీ ఎందుకు చేయకూడదో అంటూ అధికారులను ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో అధికార యంత్రాంగంతోపాటు పచ్చపార్టీ నేతల్లో అంతర్మథన మొదలైందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.