కాంగ్రెస్ పార్టీ తీరుపై మంత్రి హరీశ్ రావు ఘాటుగా స్పందించారు. సంగారెడ్డిలో ఆయన మాట్లాడుతుఊ ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని ఢిల్లీలో కాంగ్రెస్ తీర్మానం చేసిందని అయితే, ప్రత్యేక హోదా అంటే ఏంటో కాంగ్రెస్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణాకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి ఈ ప్రాంతంలో సమస్యలు సృష్టిస్తారా? అని మంత్రి హరీశ్ రావు సూటిగా ప్రశ్నించారు.
“ప్రత్యేక హోదా పేరుతో ఏపీకి పారిశ్రామిక రంగంలో ఆయా రాయితీలు, పన్ను రాయితీలను ఇస్తారు. ఇలా రాయితీలు ఇవ్వడం వల్ల తెలంగాణలోని పరిశ్రమలు ఏపీకి తరలి వెళ్లిపోతాయి. ఇలా తెలంగాణ కు అన్యాయం జరగడాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అనుమతిస్తారా.. ? ప్రజలకు సమాధానం చెప్పాలి.“ అని ఆయన స్పష్టం చేశారు. ఏపీకి పన్ను రాయితీలు ఇస్తే తెలంగాణ కు కూడా ఇవ్వాలని కోరారు. ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ నేతలు స్పష్టత ఇవ్వాలని హరీశ్ రావు కోరారురు. “హోదా తెలంగాణకు కూడా ఇస్తారా…లేదా ఏపీకి మాత్రమే ఇచ్చి తెలంగాణ కు నష్టం చేస్తారా?పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి, తెలంగాణ లోఒక్క ప్రాజెక్టు కు జాతీయ హోదా ఇవ్వలేదు. హైకోర్టు విభజిస్తామని విభజన చట్టంలో పేర్కొని, కాంగ్రెస్, బీజేపీలు విభజన చేయకుండా తెలంగాణకు నష్టం చేస్తున్నాయి. ఇదే రీతిలో భవిష్యత్లో కూడా వ్యవహరిస్తారా?“ అని ఆయన ప్రశ్నించారు.