వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 219వ రోజు తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నియోకవర్గంలో కొనసాగుతోంది. ప్రజా సమస్యలపై జగన్ చేస్తున్న పాదయాత్రకు జనం వేలాదిగా తరలి వస్తున్నారు. టీడీపీ పాలనలో గత నాలుగేళ్ల నుంచి తాము పడుతున్న కష్టాలను జననేతకు చెబుతున్నారు. చంద్రబాబు సర్కార్ తమపై వివక్ష చూపుతుందని కాకినాడకు చెందిన ముస్లింలు వైఎస్ జగన్‌తో చెప్పారు. పెద్దాపురంకు చెందిన చేనేతలు తమ సమస్యలపై వైఎస్ జగన్‌కు వినతిపత్రం ఇచ్చారు. ప్రజల కష్టాలను తెలుసుకుంటూ వారికి తానున్నానని భరోసా కల్పిస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారు.
ఇదిలా ఉండగా, ఈ నెల 24వ తేదీ మంగళవారం నాడు ప్రత్యేకహోదా సాధన కోసం పోరాటంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏపీ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఏపీ బంద్‌కు వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపు మేరకు మద్దతు తెలుపుతూ.. అనంతపురం జిల్లా పుట్టపర్తి వైసీపీ శ్రేణులు దాదాపు రెండు వేల బైక్‌లతో ఇవాళ ర్యాలీ నిర్వహించారు.