ఏపీకి ప్రత్యేక హోదాను సాధించాలంటే ఒక్క వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితోనే సాధ్యపడుతుంది, 2014 ఎన్నికల్లో 600 అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సంకుచిత బుద్ధితో ప్రత్యేక హోదా జీవ సమాధి అయిపోయింది అని సినీ నటుడు పోసాని కృష్ణ మురళీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇవాళ ఓ మీడియా ఛానెల్‌తో ఫోన్ మాట్లాడిన పోసాని కృష్ణ మురళీ రాష్ట్ర విభజన తరువాత ఏపీకి ప్రత్యేక హోదా బిల్లుపై చర్చించి.. ఆ బిల్లును ప్రణాళిక సంఘానికి పంపించారన్నారు. ఆ తరువాత కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి రావడం, ఇటు ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, ఆ తరువాత రాజకీయ సమీకరణాల్లో భాగంగా ప్రత్యేక హోదాను పక్కనపెట్టేశారన్నారు.
ఏపీలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచుతామని కేంద్ర ప్రభుత్వం.. మీరు అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచితే ప్రత్యేక హోదాను వదులుకునేందుకు తాను సిద్ధమని చంద్రబాబు ఇలా ఒకరికొకరు పరస్పర అంగీకారంతోనే ప్రత్యేకహోదాను అటకెక్కించారన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఏనాడైనా ప్రత్యేక హోదా విషయమై ప్రణాళిక సంఘ సభ్యులను కలిశాడా..? కనీసం ప్రశ్నించాడా..? అంటూ చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు పోసాని కృష్ణ మురళీ. అటు ప్రత్యేక హోదాను వదులుకున్నందుకు.. పోలవరం ప్రాజెక్టు పనులను చంద్రబాబు సర్కార్ దక్కించుకుందని, పోలవరం నిర్మాణం పేరుతో భారీ కుంభకోణాలకు చంద్రబాబు సర్కార్ తెరతీసిందని పోసాని విమర్శల వర్షం కురిపించారు.