రాష్ట్రంలోని పౌరులందరికీ ఉచిత కంటి పరీక్షలు నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆగస్టు 15 మద్యాహ్నం రెండు గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. గజ్వేల్ నియోజకవర్గంలో తానే స్వయంగా కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు, రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ను కూడా ఒక ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కోరనున్నట్లు వెల్లడించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా అదే రోజు కార్యక్రమం ప్రారంభించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించాలని, అవసరమైన వారికి కళ్లద్దాలు, మందులు అందివ్వాలని, అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు కూడా నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ఈ కార్యక్రమానికి అవసరమైన సిబ్బందిని, వైద్య పరికరాలను, వాహనాలను, కళ్లద్దాలను, మందులను సిద్ధం చేసుకోవాలని చెప్పారు.
కంటి వెలుగు కార్యక్రమంపై సిఎం కేసీఆర్ శనివారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. ‘‘గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో రాష్ట్రంలోని దాదాపు 3.70 కోట్ల మంది పౌరులందరికీ ఉచిత కంటి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంత పెద్ద కార్యక్రమం గతంలో ఎవరూ ఎప్పుడూ చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపడుతున్నందున అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. అందరు ప్రజాప్రతినిధులను ఇందులో భాగస్వాములను చేయాలి. జిల్లా కలెక్టర్లు ప్రజా ప్రతినిధులందరితో సమావేశాలు నిర్వహించి, జిల్లా స్థాయిలో షెడ్యూల్ ను తయారు చేయాలి. క్షేత్ర స్థాయిలో కార్యక్రమ నిర్వహణపై సమీక్ష ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి. అందరూ కంటి వైద్య శిబిరాలకు వచ్చేలా ఏర్పాట్లు చేయాలి’’ అని ముఖ్యమంత్రి వివరించారు.
కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణ కోసం చేసిన ఏర్పాట్లను అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు నిర్వహణ కోసం 799 బృందాలను ఏర్పాటు చేశామని, ప్రతీ బృందంలో ఒక ఎంబిబిఎస్ డాక్టర్, ఆప్తోమెట్రిస్ట్, ఎఎన్ఎం తదితరులు ఉంటారని, ఒక్కో వైద్య బృందం రోజుకు సగటున 250 మందికి పరీక్షలు నిర్వహిస్తుందని, ఐ డ్రాప్స్, మందులు సిద్ధం చేసుకున్నామని, 34 లక్షల కంటి అద్దాలు సిద్ధం చేసి జిల్లాలకు పంపుతున్నామని, అవసరమైన వారికి ఆపరేషన్లు నిర్వహించడానికి రాష్ట్రవ్యాప్తంగా 114 కంటి ఆసుపత్రులను గుర్తించినట్లు అధికారులు వివరించారు.
రాష్ట్రంలోని పౌరులందరికీ ఉచిత కంటి పరీక్షలు నిర్వహించే 'కంటి వెలుగు' కార్యక్రమాన్ని ఆగస్టు 15 మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాలని సీఎం శ్రీ కేసీఆర్ ఆదేశించారు. pic.twitter.com/ik6OpIc0Bx
— Telangana CMO (@TelanganaCMO) July 21, 2018