‘‘పరిటాల కుటుంబ సభ్యులు 1993లో సైకిళ్లలో తిరిగేవారు. ఇప్పుడు కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించి స్కార్పియోల్లో తిరుగుతున్నారు. నియోజకవర్గంలోని ఆరు మండలాలకు కుటుంబ సభ్యులు, సమీప బంధువులను ఇన్చార్జీలుగా నియమించుకుని పరిటాల కుటుంబం నియంత పాలన సాగిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆ కుటుంబానికి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు.’’ అని టీడీపీ సీనియర్ నేత, రాప్తాడు మండల మాజీ కన్వీనర్ నెట్టెం లక్ష్మీనారాయణ అన్నారు. మండలంలోని ఎం.బండమీదపల్లిలో శుక్రవారం ‘గ్రామదర్శిని–గ్రామవికాసం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అయితే మండలంలోనే సీనియర్ నేత అయిన నెట్టెం లక్ష్మీనారాయణతో పాటు ఆయన అనుచరవర్గం ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. సమావేశం ముగిసేంత వరకు వీరంతా గ్రామంలోని ఆయన తోటలో విందు చేసుకున్నారు. గ్రామంలో దాదాపు 500 మంది కార్యకర్తలు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పరిటాల కుటుంబం తనను రాజకీయంగా అణగదొక్కిందన్నారు. సంక్షేమ పథకాల విషయంలో తన వర్గీయులకు తీరని అన్యాయం చేశారన్నారు. 36 సంవత్సరాలు పార్టీ కోసం అహర్నిశలు కష్టపడినా కనీస గుర్తింపును కూడా ఇవ్వలేదన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పరిటాల కుటుంబానికి అసమ్మతి వర్గం తయారైందన్నారు. ఎన్నికల్లో వీరంతా పరిటాల కుటుంబానికి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.