ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన తప్పును రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతవైఎస్ జగన్ బ్రహ్మాస్త్రంగా మార్చుకున్నారు. మరి చంద్రబాబు నాయుడు చేసిన ఆ తప్పేంటి..? దీని వల్ల వైసీపీకి వచ్చే లాభమేంటి..? 2019 ఎన్నికల్లో భాగంగా జగన్ ఈ బ్రహ్మాస్ర్తాన్ని ప్రయోగిస్తారా..? మరి జగన్ వేసే ఈ ప్లాన్‌తో టీడీపీ ఎలాంటి పరిణామాలను ఎదుర్కోనుంది..? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ కథనాన్ని పూర్తిగా చదవాల్సిందే.
అయితే, ఇప్పటికే ఏపీలో ఎన్నికల వేడి జోరందుకున్న విషయం తెలిసిందే. ఏపీ రాజకీయాల్లో కొన్ని ప్రధాన పార్టీలు ఎలాగైనా సరే 2019 ఎన్నికల్లో అధికార బాధ్యతలు చేపట్టాలనే ఉద్దేశంతో ప్రచార హంగామాలో తెగ మునిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయా పార్టీల అధినేతలు ఏదో ఒక రూపంలో ఏపీ వ్యాప్తంగా పర్యటనలు, సభలు, ర్యాలీలు అంటూ నిమగ్నమైపోతున్న విషయం విధితమే. ఇందుకు వైసీపీ మిగిలిన రెండు పార్టీలకు భిన్నంగా స్కెచ్ వేస్తోంది. రాజకీయ పోరాటానికి.. న్యాయ, ప్రజా పోరాటాన్ని జోడించాలని వైఎస్ జగన్ వ్యూహ రచన చేశారు. రాజకీయ విమర్శలు పలుచబారిపోతుండటంతో.. ప్రజల్లో పెద్దగా చర్చకు రావడం లేదు. అందుకే వాటికి ప్రత్యామ్నాయం సిద్ధం చేయాలని వైఎస్ జగన్ ఆలోచించారు.
అయితే, రాష్ట్రాన్ని విడగొట్టి కాగ్రెస్, విభజనకు మద్దతు తెలిపి టీడీపీ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి బీజేపీ ఇలా ఈ మూడు పార్టీలు ఏపీ ప్రజల దృష్టిలో విలన్ ముద్ర వేయించుకున్నారు. అంతేకాకుండా, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ పార్టీలు ఇప్పటికీ తప్పుల మీద
తప్పులు చేస్తున్నాయనే భావనను ఏపీ ప్రజలు సైతం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ మాత్రం నాడు ఏపీ ప్రజల అభివృద్ధి దృష్ట్యా రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా, నేడు ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా పోరాటాన్ని ఉధృతం చేస్తున్న విషయం విధితమే. అంతేకాకుండా, పోరాటంలో భాగంగా వైసీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని సైతం లెక్క చేయకుండా అవిశ్వాస తీర్మానం పెట్టి రాజీనామాలు చేశారు. ఇలా ప్రత్యేక హోదా సాధన కోసం చేయాల్సిన అన్ని ప్రయత్నాలను చేస్తూ, మరో పక్క ప్రజలను చైతన్యవంతులను చేస్తూ వైసీపీ తన ప్రయత్నాలను ముమ్మర ప్రయత్నాలను కొనసాగిస్తోంది.