ఆనం కొడుకు సీఎం చంద్రబాబుకు ఏమని షాక్ ఇచ్చాడు. ఈ విషయంలో చంద్రబాబు రియాక్షన్ ఏమిటి..? అసలు ఆనం కొడుకు, చంద్రబాబు మధ్య ఏం జరిగింది..? ఈ ప్రభావం నెల్లూరు జిల్లా టీడీపీపై పడనుందా..? ఇటీవల కాలంలో జగన్‌తో ఆనం రామ నారాయణరెడ్డి భేటీ నిజమేనా..? ఇలా అనేక ప్రశ్నలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాలపై ఆనం కుటుంబం స్పందించింది.
కాగా, మంగళవారం నాడు నెల్లూరు నగరం 12వ డివిజన్ పరిధిలోగల సౌత్ రాజుపాళెంలో ఆనం కుటుంబం అభిమానులు ఏర్పాటు చేసిన సభలో 12వ డివిజన్ కార్పొరేటర్ ఆనం రంగమయూర్‌రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆనం రంగమయూర్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంపై, అలాగే, సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబుపై నమ్మకంతో ఆనం రామనారాయణరెడ్డి, దివంగత ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి.. చంద్రబాబు ఇచ్చిన హామీలతో గతంలో టీడీకీ కండువా కప్పుకున్నారని, కానీ, వారు టీడీపీలో చేరినప్పట్నుంచి జిల్లాలోని ఇతర టీడీపీ నేతలు, నాయకులు వారిని చులకన భావంతో చూస్తూ, అసభ్యకర పదజాలంతో మాట్లాడం జరిగిందన్నారు.
నెల్లూరు జిల్లా టీడీపీ నేతలతోను, నాయకులతోను ఎన్ని చీత్కారాలు ఎదుర్కొన్నా.. కేవలం ఒక్క చంద్రబాబు నాయుడుపై నమ్మకంతో ఇన్నాళ్లు వారు టీడీపీలో ఉన్నారని, చివరకు ఆనం వివేకానందరెడ్డి మరణం తరువాత.. సీఎం చంద్రబాబు ఆనం రామనారాయణరెడ్డికి ఓదార్పునివ్వకపోవడం దారుణమన్నారు. సీఎం చంద్రబాబు నయ వంచనకు ఇది మరో ప్రతీరూపమని కార్పొరేటర్ ఆనం రంగమయూర్‌రెడ్డి మీడియా సాక్షిగా చెప్పడం గమనార్హం. అయితే, రంగమయూర్‌రెడ్డి వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకున్న పలువురు రాజకీయ విశ్లేషకులు ఆనం కుటుంబం త్వరలో పార్టీ మారనుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.