నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం బోధన్‌లో బోధన్ మండలం మరియు పట్టణ టీఆర్ఎస్ బూత్ కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. సమావేశానికి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అధ్యక్షత వహించారు రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ భారతదేశ స్థాయిలో ప్రభుత్వం నడిపే అవకాశం రావొచ్చునని, ఇది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మనందరికీ గర్వకారణం అవుతుందన్నారు.
మన నాయకుడు కేసీఆర్ ఎప్పుడూ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడుతూనే, కార్యకర్తల వెన్నంటి ఉంటారని ఎంపీ కవిత తెలిపారు. ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తే అది పార్టీకి లభించిన గౌరవం అని అన్నారు. మీ నడవడిక పార్టీ పై ప్రభావం చూపుతుందన్నారు. మీ వ్యక్తిగత జీవితం ప్రజాజీవితాన్ని ప్రజలు గమనిస్తున్నారని, పార్టీకి చెడ్డ పేరు తెచ్చే పని చేయవద్దని ఎంపీ కవిత కోరారు. ప్రతి కార్యకర్త పైస్థాయికి ఎదగాలని కోరుకోవడం సహజం అని అయితే అవకాశము, అదృష్టం రెండు కలిసి రావలసి ఉంటుందన్న విషయం గమనించాలి అని అన్నారు. ఈ విషయంలో తనను ఉదాహరణగా తీసుకోవాలన్నారు. కాస్త ముందు వెనకా అవకాశాలు అందరికీ వస్తాయని, వచ్చే అవకాశాలను ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎమ్మెల్యేలు ప్రజల్లోనే ఉంటున్నారని కవిత చెప్పారు.
తెలంగాణ పార్టీని ప్రజలు ఇంటి పార్టీగా మన పార్టీని ఆదరిస్తున్నారని అదే ఇతర పార్టీలను రాజకీయ పార్టీలుగా భావిస్తున్న విషయం పార్టీ సభ్యులుగా మనందరికీ గర్వకారణం అని ఎంపీ కవిత అన్నారు. బోధన్ నియోజక వర్గంలో 58వేల మంది పార్టీ సభ్యత్వం ఉందని టౌన్ లో 13000, మండలంలో 18000 సభ్యత్వం ఉన్న విషయం మనందరికీ తెలుసు అన్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ ముందున్న నిజామాబాద్ జిల్లా అభివృద్ధిలో అదే ఒరవడితో ముందుకు దూసుకెళ్తూ ఉందని తెలిపారు. ఒక్క బోధన్ పట్టణంలో రూ.231 కోట్ల రూపాయలను అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం ఖర్చు చేసిందని కవిత తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త పైన ఉందని అన్నారు. బంగారు తెలంగాణ సాధన కోసం అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని ఎంపి కవిత పిలుపునిచ్చారు. బోధన్ మున్సిపల్ చైర్మన్ ఎల్లం పదవినుంచి తొలగించేందుకు కుట్రలు పన్నారని..ఆ కుట్రలను సమర్థవంతంగా తిప్పి కొట్టామని ఎంపీ కవిత చెప్పారు. భవిష్యత్‌లో ఎన్ని కుట్రలు పన్నినా ఎదుర్కొనేందుకు మనమంతా సిద్ధంగా ఉండాలని బూత్ కమిటీ సభ్యులను ఎంపి కవిత కోరారు.