పోలవరం ప్రాజెక్టు అంచనాల పెంపు అంశం ఊహించని మలుపు తిరిగింది. అమాంతం పెరిగిపోయిన అంచనాలపై కేంద్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబును నిలదీసింది. పోలవరం ప్రాజెక్టు సాక్షిగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నిలదీస్తే నీళ్లు నమలడం చంద్రబాబు వంతైంది. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సిద్ధమన్న గడ్కరీ అంచనాలు ఎందుకు పెంచాల్సి వచ్చిందో తేల్చాల్సిందేనని స్పష్టం చేశారు.
కాగా, బుధవారం పోలవరం ప్రాజెక్టు సందర్శనకు చాలా కాలం తరువాత వచ్చిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చంద్రబాబు ప్రభుత్వానికి ఊహించని షాక్ ఇచ్చారు. రూ.57,940 కోట్లతో ఏపీ ప్రభుత్వం పంపిన డీపీఆర్-2పై నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు ముందస్తుగా రూ.10వేల కోట్లు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అంచనాలతో సంబంధం లేకుండా ఇవ్వాలని గతంలో లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గడ్కరీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పోలవరం ప్రాజెక్టు సైట్లోనే మీడియా సాక్షిగా, ప్రజలందరికీ తెలిసేలా గడ్కరీ చంద్రబాబును నిలదీశారు.
సీఎం చంద్రబాబు అడ్వాన్స్ అడుగుతున్నారని, ఇలా ఇవ్వాలంటే ముందు ఆర్థికశాఖ అనుమతులు అవసరమని గడ్కరీ అన్నారు. డీపీఆర్‌లో చాలా మార్పులు ఎందుకు వచ్చాయని గడ్కరీ ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల ప్రజల పునరావాసానికి చెల్లించాల్సిన వ్యయానికి సిద్ధమేనని, పునరావాస ప్రాంతం ఎందుకు అనూహ్యంగా పెరిగిందని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుగా దీనిపై సమాధానం చెప్పాల్సిందేనని, దీనిపై సమాధానం చెప్తే ఆర్థిక శాఖకు ఎనిమిది రోజుల్లో ఆర్థికశాఖకు డీపార్ను పంపుతామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు.