సాధారణంగా ప్రజావ్యతిరేకతకు ఏ పార్టీ అయినా భయపడుతుంది. అధికారంలో ఉన్న వాళ్లకు ఎన్నికలు వస్తే దడ మొదలవుతుంది. అంత వరకూ అధికారంలో ఉన్న తమపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చి ఉంటుందని, దీంతో ఓటమి అవకాశాలు పెరుగుతాయని, ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో ప్రతిపక్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని రాజకీయ పార్టీలు భయపడుతూ ఉంటాయి. అయితే 2004లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో చాలా మంది నేతల దశ తిరిగింది. అలాంటి వారిలో ఒకడు సాకే శైలజనాథ్. అనంతపురం జిల్లాకు చెందిన ఈ నేత శింగనమల నియోజకవర్గం నుంచి అప్పట్లో ఎమ్మెల్యేగా గెలిచాడు. తొలిటర్మ్ లో ఎమ్మెల్యేగా ఉండిన సాకే.. రెండో టర్మ్ లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే సమయానికి క్యాబినెట్ మంత్రి పదవిని సంపాదించాడు. రాజకీయ ప్రముఖుడు అయ్యాడు.
అయితే వ్యక్తిగతంగా అంత గొప్ప జనబలం ఉన్న నాయకుడు కాదని జనాభిప్రాయం. శింగనమల రిజర్వ్ డ్ నియోజకవర్గం. ప్రస్తుతానికి అయితే ఇక్కడ తెలుగుదేశానికి సరైన ప్రాతినిధ్యం లేదు..దీనికి తోడు శింగనమల వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన జొన్నలగడ్డ పద్మావతి సామాజిక వర్గం , శైలజానాథ్ సామాజిక వర్గం అధికంగా ఉన్నారు. నియోజకవర్గంలోని గ్రామగ్రామంలోనూ వీరిద్దరి అనుచరులున్నారు. నేతలతో సత్సంబంధాలున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న వైసీపీ అధినేత జగన్ కూడా శైలజానాథ్‌ను పార్టీలో చేర్చుకుని ఆ బలాన్ని మరింత పెంచాలని అనుకుంటున్నట్లు సమాచారం. సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే యామినీ బాలను ఎదుర్కునే విదంగా వైసీపీ నాయకులు ఉండాలని జగన్ భావిస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో అఖండ మెజార్టీతో శింగనమల నియోజకవర్గం వైసీపీ ఖాతాలో చేరాలని వైసీపీ నేతలు చేబుతున్నారు. అంతేకాదు అన్నీ అనుకున్నట్లు జరిగితే మరికొద్దిరోజుల్లోనే శైలజానాథ్ వైసీపీలో చేరడం ఖాయంగానే కనిపిస్తోంది.