ఏపీ ప్రథాన ప్రతిపక్షం అధినేత వైఎస్ జగన్.. మరోసారి ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని తన భుజానికెత్తుకున్నారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీకు ప్రాణవాయువులా భావించే ప్రత్యేక హోదాను జగన్ కూడా ఈమధ్య కాలంలో పక్కన పెట్టారు. బీజేపీకి దగ్గర కావడం కోసమే ప్రత్యేకహోదాను జగన్ మర్చిపోయారన్న విమర్శలు విన్పించాయి. ఈ నేపథ్యంలో ఈ విమర్శలను తిప్పికొట్టేందుకు జగన్ ప్రత్యేక హోదాపై సమర శంఖారావాన్ని పూరించనున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు అనంతపురం జిల్లాలో యువభేరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ప్రత్యేక హోదాపై జగన్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును తీవ్రంగా తప్పుపట్టనున్నారు.
విభజనతో నష్టపోయిన ఏపీకు ప్రత్యేక హోదా ఒక్కటే పరిష్కారమని వైసీపీ భావిస్తోంది. గతంలో ఇదే అంశంపై జగన్ మోహన్ రెడ్డి నిరవధిక నిరహారదీక్షకు కూడా దిగారు. అయినా ప్రభుత్వాలు దిగిరాలేదు. వచ్చే ఎన్నికల్లో ప్రత్యేక హోదా కీలకాంశమని భావించిన జగన్ మరోసారి ఈ అంశంపై పోరాటానికి సిద్ధమయ్యారు. అనంతపురం తర్వాత రాష్ట్రంలోని ఐదు ప్రధాన నగరాల్లో బహిరంగ సభలను నిర్వహించాలని జగన్ నిర్ణయించారు. ఇప్పటికే జగన్ ప్రత్యేక హోదాపై కాకినాడ, తిరుపతి, శ్రీకాకుళం, విశాఖ, నెల్లూరు, కర్నూలు, ఏలూరు ల్లో యువభేరి కార్యక్రమాన్నినిర్వహించారు. మిగిలిన జిల్లాల్లో కూడా యువభేరిని నిర్వహించడానికి జగన్ సిద్ధమవుతున్నారు.