ఏపీకి ప్రత్యేక హోదా ఉద్యమం తారస్థాయికి చేరడంతో రాజకీయ పరిస్థితులు అనూహ్యంగా మారిపోయిన్నాయి. ప్రధానంగా ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ మొదటి నుండే పోరాడుతుందని తేలిపోయింది. ప్రస్తుతం హోదాపై టీడీపీ ప్రభుత్వం గట్టిగా పోరాడుతున్నామని చెబుతున్నా.. నాలుగేళ్లుగా ఆ పార్టీ వేసిన పిల్లిమొగ్గలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇక వైసీపీ తొలి నుంచి హోదా కోసం చేస్తున్న పోరాటాలు ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వెళుతున్నాయి. దీంతో ఏపీ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రజల్లో టీడీపీ ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తిని గమనించిన నేతలు.. ఇప్పుడు వైసీపీలోకి జంప్ అయిపోతున్నారు.
మొన్నటివరకూ టీడీపీ గాలి బలంగా వీచినా.. ఇప్పుడు ఇది వైసీపీ వైపు మళ్లిందనే చర్చ జరుగుతోంది. ఒకరి తర్వాత మరొకరు ఇప్పుడు టీడీపీ నేతలు వైసీపీ కండువా కప్పేసుకోవడం ఇందుకు మరింత బలం చేకూరుస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. ప్రజల సమస్యల కోసం నిరంతర పోరాడుతున్న వైఎస్ జగన్ చూసి వైసీపీ పార్టీలోకి రోజురోజుకు వలసలు పెరుగుతున్నాయి. అంతేకాదు రెండేళ్ల క్రితం ఏపీని కుదిపేసిన అంశం. వైసీపీలో గెలిచిన ఎమ్మెల్యేలు 23 మంది టీడీపీలో చేరడం. ఇందులో కొంతమంది మంత్రి పదవులు కూడా కొట్టేశారు. వీరిపై అనర్హత వేటు వేయాలని వైఎస్ జగన్ ఇప్పటికి పోరాడుతున్నారు. అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టేశారు. అయితే రాజకీయ పరిస్థితులు వేగంగా మారి పోయాయి. దీంతో ప్రభుత్వం తీవ్ర అవినీతిలో కూరుకుపోయిందనే విమర్శలు ముఖ్యమంత్రి చంద్రబాబును ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.
ఇకపోతే ప్రజాసంకల్పం పేరుతో వైఎస్ జగన్ గత ఎడాది నవంబర్ నెల నుంచి పాదయాత్ర చేపట్టారు. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు మొత్తం 3 వేల కిలోమీటర్లు ఈ పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పాదయాత్ర లో ఎక్కడ చూసిన వైసీపీలోకి భారీగా టీడీపీలో నుండి వలస వచ్చారు. ఎమ్మెల్యేలు..మాజీ ఎమ్మెల్యేలు..ఎంపీలు..సీనియర్ నేతలు , కార్యకర్తలు ఇలా పట్టణాల్లోనే గాక గ్రామాల్లో కూడ భారీగా వైసీపీలో చేరారు. ఇలా పాదయాత్ర మొదలు నుండి ఇప్పటి వరకు 9 జిల్లాలో లక్షమందికి పైగా వైసీపీలోకి చేరారు. ఈ లెక్కతో వైసీపీ హావా ఏపీలో ఏవిదంగా నడుస్తుందో తెలుస్తుంది. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం సాదిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.. ఇప్పుడు ఈ వార్తతో టీడీపీ నేతల్లో వణుకు మొదలైయ్యింది.