అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెలుగుదేశం పార్టీకి పెద్ద షాక్ తగిలింది. సీనియర్ నేతలు బొమ్మిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, 23వ వార్డు కౌన్సిలర్ జయచంద్రారెడ్డిలు (జగ్గీ బ్రదర్స్) టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ జిల్లా అధిష్టానం నెల రోజుల క్రితం జగ్గీ బ్రదర్స్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. జగ్గీ బ్రదర్స్ జూన్ 20న వివరణ కూడా ఇచ్చారు. అయితే సంజాయిషీ సంతృప్తికరంగా లేదంటూ జగ్గీ బ్రదర్స్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు అధ్యక్షుని పేరుతో ఉన్న ఉత్తర్వులు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేశాయి. దీంతో మనస్తాపానికి గురైన వారిద్దరూ టీడీపీకి గుడ్‌బై చెప్పారు. తాజా పరిణామాలతో తాడిపత్రి టీడీపీలో విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. మరికొందరు సీనియర్ నేతలు పార్టీ వీడే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
see also:చంద్రబాబు నిరుద్యోగ భృతి కాదు.. అవి కావాలి..పవన్ కల్యాణ్
1993 నుంచి జగదీశ్వర్‌రెడ్డి– జయచంద్రారెడ్డి సోదరులు టీడీపీలో కొనసాగుతూ వస్తున్నారు. జేసీ సోదరుల నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న జగ్గీ సోదరులు కష్టకాలంలో పార్టీని వీడక అలాగే అంటిపెట్టుకుని సేవ చేశారు. 2014 ఎన్నికల్లో జేసీ సోదరులు టీడీపీలో చేరారు. అప్పటి నుంచి జేసీ బ్రదర్స్ – జగ్గీ బ్రదర్స్ విభేదాలు వీడి ఒక్కటయ్యారు. ఈ క్రమంలో 23వ వార్డు కౌన్సిలర్‌గా జగ్గీ సోదరుడు జయచంద్రారెడ్డి ఎన్నికయ్యారు. ఇదిలా వుండగా జగదీశ్వర్‌రెడ్డి (జగ్గీ)కి మార్కెయార్డ్ పదవి విషయంలో జిల్లా నాయకుల అండదండలు సంపాదించడంతో ఆ విషయం ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డికి మింగుడుపడలేదు. దీంతో మార్కెట్‌యార్డు పదవి జగ్గీకి దక్కకుండా పావులు కదిపారని అప్పట్లో ప్రచారం జరిగింది.
see also:వైసీపీ శ్రేణులకు, అభిమానులకు పెద్ద శుభవార్త..!
గతంలో జరిగిన ఓ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, అతని అనుచరుడు ఎస్వీ రవీంద్రారెడ్డి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని, ప్రజా ధనాన్ని దోచుకుతింటున్నారని కౌన్సిలర్ జయచంద్రారెడ్డి ఆరోపించారు. దీంతో జయంద్రారెడ్డిని మూడు నెలల పాటు కౌన్సిల్ నుంచి సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి ఎమ్మెల్యే జేసీ, జగ్గీ బ్రదర్స్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఆ తర్వాత కూడా ఎమ్మెల్యే జేసీ నిర్వాకం వల్లే తాడిపత్రిలో గ్రానైట్ పరిశ్రమ దెబ్బతిందని, పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోందని జయచంద్రారెడ్డి పత్రికాముఖంగా దుమ్మెత్తిపోశారు. జగ్గీ బ్రదర్స్ తీరుపై ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తెలుగుదేశం అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయించాలని ఒత్తిడి పెంచడంతో జిల్లా అధ్యక్షుడు షోకాజ్ నోటీసు జారీ చేశారు.