బాత్రూం లో మొబైల్ ఫోన్ వాడుతున్నారా?… ఐతే ఈ వార్త మీకోసమే ఈ మధ్య జనాలు స్మార్ట్‌ఫోన్ లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేక పోతున్నారు. చివరికి టాయ్‌లెట్‌కి వెళ్లేటప్పుడు కూడా స్మార్ట్‌ఫోన్ తీసుకెళ్తున్నారు. అయితే అలా తీసుకెళ్లడం వల్ల డయేరియా, మూత్ర సంబంధ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. టాయ్లెట్లో ఉండే సింకులు, నల్లాలు, బేసిన్ల మీద ఇశ్చిరియా కొలై, క్లాస్ట్రీడియం డిఫిచిలే వంటి రోగాలు కలిగించే బాక్టీరియా ఉంటుందని, టాయ్‌లెట్‌కి మొబైల్ తీసుకెళ్లి ఆ బేసిన్లను ముట్టుకున్న చేతులతోనే మళ్లీ మొబైల్ పట్టుకోవడం వల్ల బాక్టీరియా ఫోన్ మీదకి చేరుకుంటుందని, అలా చేరుకోవడం వల్ల ఎప్పుడూ తోడుగా ఉండే ఫోన్ నుంచి ఏదో రకంగా బాక్టీరియా శరీరంలో ప్రవేశించే అవకాశం ఉంటుందని లండన్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ పాల్ మెటెవాలే తెలిపారు. అలాగే సాధారణంగా చేసే కొన్ని పనులను పట్టించుకోకపోవడం వల్ల కూడా ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది. బ్యాగులను శుభ్రం చేయకపోవడం, బూట్లను ఇంటి లోపల ధరించడం, విప్పడం, టీవీ రిమోట్, కంప్యూటర్ కీబోర్డు, మౌస్‌లను శుభ్రం చేయకపోవడం వల్ల కూడా రోగాల బారిన పడే అవకాశం ఉంది. అందుకే వాటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.