ఉమ్మడి ఏపీలో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ సంచలనం రేపింది. సరిగ్గా 2009 ఎన్నికలకు 9 నెలలకు ముందు చిరు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. దీంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్షాల నుంచి పోలోమంటూ ప్రజారాజ్యంలో చేరారు..వారితో పాటు పరకాల ప్రభాకర్ లాంటి కోవర్టులు కూడా చేరి పార్టీని ముంచి పోయారు. అయితే ఎన్నికలకు ముందు సీట్లు కేటాయింపు గందరగోళంగా మారింది.చిరు ఛరిష్మాతో అవలీలగా అధికారంలోకి వస్తామని కలలు కన్న ఎంతో మంది ఛోటో మోటా నాయకులు పార్టీ కోసం తమ ఆస్తులను అమ్ముకుని ఖర్చుపెట్టారు. తీరా ఎన్నికల సమయానికి సీట్ల కేటాయింపులో వివిధ పార్టీల నుంచి వచ్చిన నేతలకే సీట్లు ఇవ్వడంతో అసంతృప్తి జ్వాలలు చెలరేగాయి. చిరు బామ్మర్ధి అల్లు అరవింద్ టికెట్లు అమ్ముకుని కోట్లు వెనేకేసుకున్నారంటూ ఎల్లో మీడియా ప్రజారాజ్యంపై బురద జల్లింది. దీంతో పూర్తిగా బద్నాం అయిన ప్రజారాజ్యం పార్టీ ఆ ఎన్నికల్లో కేవలం 18 సీట్లకే పరిమితం అయింది. ఆ తర్వాత తనను నమ్ముకున్న ఆ 18 మంది ఎమ్మెల్యేలు ఒత్తిృడి చేయడంతోపాటు, కుళ్లు కుతంత్రాల రాజకీయాల్లో ఇమడలేని చిరు ప్రజా రాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసి తనకు దక్కిన ఎంపీ సీటుతో రాజీ పడిపోయాడు. మొత్తానికి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ చరిత్రలో ప్రజారాజ్యం పార్టీ విఫల ప్రయోగంగా మిగిలిపోయింది.
ప్రజారాజ్యం పార్టీలో మెగాస్టార్ చిరు సోదరుడు పవన్ కల్యాణ్ యువరాజ్యం అధ్యక్షుడిగా ఎన్నికల్లో విస్తృతంగా పర్యటించినా లాభం లేకుండాపోయింది. ప్రజారాజ్యం పతనానికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన పవన్ కల్యాణ్ గత ఎన్నికలకు ముందు జనసేనను స్థాపించి మరోసారి చేతులు కాల్చుకున్నాడు. ప్రజారాజ్యం పార్టీలో జరిగిన తప్పు ఒప్పులను బేరీజు వేసుకుని ముందుకుపోతానని, జనసేనను విన్నూత పంథాలో నడిపిస్తానని, రాజకీయాల్లో జనసేన సరికొత్త ఒరవడి సృష్టిస్తుందని పవన్ గొంతు చించుకుని చెప్పుకున్నాడు.. పూర్తిగా కొత్తవారితో, సమాజానికి మంచి చేయాలనే లక్ష్యంతో, తమ సిద్ధాంతాలతో భావసారూప్యతం ఉన్న యువకులతోనే జనసేన పోటీ చేస్తుందని పవన్ ప్రకటించాడు. గత ఎన్నికల్లో పోటీ చేయకుండా ముందస్తుగా చంద్రబాబు, రామోజీలతో కుదిరిన ఒప్పందం ప్రకారం టీడీపీ, బీజేపీ తరపున ప్రచారం చేశాడు. సహజంగా సినీ స్టార్‌గా తనకున్న ఇమేజ్‌తో యువతను ఆకర్షించి టీడీపీ, బిజేపీని గెలిపించాడు. ఇది ఎవరూ కాదనలేని సత్యం. అయితే ఈ మూడేళ్లుగా జనసేన పార్టీ నిర్మాణంపై పెద్దగా దృష్టి పెట్టింది లేదు. ప్రజా సమస్యలపై పెద్దగా పోరాడింది లేదు.ల్యాండ్‌పూలింగ్ విషయంలో, అగ్రిగోల్డ్ రైతుల విషయంలో బాధితులకు అండగా నిలబడాల్సింది పోయి చంద్రబాబుకే మద్దతు ఇచ్చాడు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని విమర్శిస్తాడు..కానీ ఓటుకు నోటు కేసులో దొరికిపోయి ప్రత్యేక హోదా అంశాన్ని మోదీ పాదాల దగ్గర తాకట్టు పెట్టిన చంద్రబాబును ఒక్క మాట అనడు..అటు చంద్రబాబు కూడా పవన్ని ఇప్పటికీ మిత్రుడిగానే భావిస్తాడు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ టీడీపీ, జనసేనల మధ్య పొత్తు కుదిరినా ఆశ్చర్యం లేదు..
వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ ప్రకటించాడు. అయితే వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకుడు జగన్ని అధికారంలోకి రానివ్వకుండా ఓట్లు చీల్చి మళ్లీ చంద్రబాబునే సీఎం చేయడానికే ఇలా పవన్ అన్ని సీట్లలో జనసేన పార్టీని రంగంలోకి దింపుతున్నాడని..పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా వచ్చే ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీలో టికెట్లు దక్కవని భావించిన నాయకులు జనసేనలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే తొలుత వచ్చే ఎన్నికల్లో 100 శాతం కొత్తవారితో , యువరక్తంతో బరిలో దిగుతామని ప్రకటించిన పవన్ కల్యాణ్ ఇప్పుడు మాటమార్చాడు. తాజాగా 40 శాతం పాతవారితో మిగిలిన 60 శాతం కొత్తవారితో బరిలోకి దిగుతామని జనసేన అధికారికంగా ప్రకటించింది. దీంతో జనసేనను అభిమానించిన కార్యకర్తలు, నాయకుల్లో తీవ్ర అసంతృప్తి రగులుతోంది. అంతా కొత్తవారితో బరిలో దిగితే కొన్ని స్థానాలు కూడా గెలవడం కష్టమని సన్నిహితులు ఇచ్చిన సలహాతో పవన్ తన నిర్ణయాన్ని మార్చుకుని పాతవారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి ఆశావహులు ఆనందపడుతున్నారు. ఈ 40 శాతం కాస్తా వచ్చే ఎన్నికల సమయానికి 60 నుంచి 70 శాతం పెరుగుతుందని వివిధ పార్టీల్లో ఉన్న సీనియర్ నాయకులు భావిస్తున్నారు.అందుకే తమ పార్టీలో టికెట్ దక్కకపోతే వెంటనే జనసేన తరుపున పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు..దీంతో గత మూడేళ్లుగా జనసేనలో నాయకులుగా చెలామణీ అవుతున్నవారిలో కలవరం మొదలైంది.
పవన్‌కు నిలకడలేమి ప్రధాన సమస్య. ఆవేశమే తప్ప ఆలోచన తక్కువ, ఎన్నికలు ఇంకా ఏడాదిన్నర కూడా లేని సమయంలో వచ్చే నెల నుంచి పార్టీని , క్యాడర్‌ను బలోపేతం చేస్తా అంటున్నాడు. ఇప్పటికే రాజకీయాల్లో కొత్త అయిన నాయకులు, యువకులు పెద్ద ఎత్తున జనసేనలో చేరారు..ఎన్నికల సమయానికి పాత నాయకులు చేరినా కాదనలేని పరిస్థితి. తమకు టికెట్లు ఇవ్వకుంటే రచ్చ రచ్చే అని సవాలు విసురుతున్నారు. మొత్తానికి జనసేన తీరు చూస్తుంటే ఎన్నికల సమయానికి టికెట్ల కోసం పాత, కొత్తవారి మధ్య కుమ్ములాటలు తప్పవనిపిస్తుంది. ఇదంతా సేమ్ టు సేమ్ ప్రజారాజ్యం సీన్‌ను తలపిస్తోంది. అప్పుడు టికెట్ల సమయంలో కుమ్ములాటలే ప్రజారాజ్యం పతనానికి దారి తీసింది. ప్రస్తుత పరిస్థితిని చూస్తే మళ్లీ జనసేనలో కూడా అదే సీన్ రిపీట్ కాబోతోంది. ప్రజారాజ్యం ఫెయిల్యూర్‌ను పవన్ గుణపాఠంగా తీసుకుని జాగ్రత్త పడకుంటే జనసేన కూడా మరో ప్రజారాజ్యంలా విఫల ప్రయోగంలా మిగిలిపోవడం ఖాయం..