తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల అనుభవం పేరుతో ఏపీ ప్రజలను నట్టేట ముంచేందుకు సిద్ధమయ్యారని సినీ నటుడు కృష్ణం రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇటీవల ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కృష్ణం రాజు మాట్లాడుతూ.. నాలుగు సంవత్సరాలుపాటు బీజేపీతో కలిసి ఏపీని పాలించిన చంద్రబాబు, చివరకు ఏపీలో టీడీపీపై వ్యతిరేక భావన నెలకొనడంతో.. ఆ వ్యతిరేకతను బీజేపీపై నెట్టేసేందుకు సీఎం చంద్రబాబు భారీ కుట్రకు తెర తీశారన్నారు.
అయితే, ఇటీవల కాలంలో ఆపరేషన్ గరుడ అంటూ ఓ స్క్రిప్ట్‌ను తయారు చేసి, ఆ స్క్రిప్ట్‌లో శివాజీకి ప్రధాన పాత్ర ఇచ్చి రక్తి కట్టిస్తున్నారన్నారు. నోటుకు ఓటు కేసులో అడ్డంగా బుక్కైన చంద్రబాబు.. ఆ కేసునుంచి తప్పించుకునేందుకు ప్రత్యేక హోదా కోరుతూ రాష్ట్రం నుంచి పంపాల్సిన ఫైల్‌ను సీఎం చంద్రబాబు కేంద్రానికి చేరవేయలేదన్నారు.
రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసిందని చంద్రబాబు నాయుడు చేసే దీక్షల పైసా ఉపయోగం లేదని కృష్ణం రాజు వ్యాఖ్యానించారు. దీక్షల పేరుతో ప్రజా ధనాన్ని వృధాగా ఖర్చు పెడుతున్నారన్నారు. అంతేకాకుండా, బీజేపీపై అసత్య ప్రచారాలు చేసేందుకు ప్రజా ధనాన్ని ఉపయోగిస్తున్నారన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు దీక్షలు చేస్తుండటం విడ్డూరంగా ఉందన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి నిజమైన నాయకుడు ఆయనేనంటూ వైఎస్ జగన్‌పై కృష్ణం రాజు ప్రశంసల వర్షం కురిపించారు.