తెలంగాణ రాష్ట్ర౦లో ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ నిజామాబాద్ పార్లమెంట్ సబ్యురాలు , టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఒంటి చేత్తో సింగరేణి ఎన్నికల బాధ్యతను తన భుజాలపై వేసుకున్నారు. తన మాటల తూటాలతో ప్రతిపక్షాల కుట్రలను ఎండగట్టారు. వాస్తవాలను కార్మికులకు వివరించి, కార్మికుల అభిమానాన్ని సంపాదించారు. ఫలితంగా టీబీజీకేఎస్ కు అపురూప విజయాన్ని కట్టబెట్టారు.
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు అనే సరికి ప్రధాన రాజకీయ పార్టీలన్నీ దృష్టి పెట్టాయి. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద కార్మిక సంఘం కావటంతో వివిధ పార్టీల పెద్దలందరూ ఎన్నికల్లో తలదూర్చారు. ఒంటరిగా టీబీజీకేఎస్ ను ఓడించలేమని చివరికి ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత జానారెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ కుంతియా, మల్లు భట్టి విక్రమార్కతో సహా.. టీడీపీ నేత రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ లాంటివారు ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. విషప్రచారాలు, అవాస్తవాలతో కార్మికులను ప్రలోభపెట్టేందుకు శక్తివంచన లేకుండా కుయుక్తులు చేశారు. వాటన్నింటినీ తిప్పికొట్టిన ఎంపీ కవిత.. ప్రతిపక్ష కుతంత్రాలను చిత్తుచేశారు. అలుపన్నదే ఎరగకుండా విస్తృతంగా ప్రచారం చేశారు. కార్మికులకు నిజాలను వివరించారు. టీఆర్ఎస్ నేతలను అస్త్రాలుగా చేసుకొని.. జాతీయ సంఘాల పన్నాగాలను తిప్పికొట్టారు.
టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న ఎంపీ కవిత.. సింగరేణి కార్మికుల సమస్యలపై ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తున్నారు. తోటి ఎంపీలతో కలిసి జాతీయ స్థాయిలో సింగరేణిపై తెలంగాణ గొంతు వినిపించారు. సీఎం కేసీఆర్ తో మాట్లాడి కార్మికుల సమస్యలను పరిష్కరించారు. అంతేకాదు కార్మికులు సమస్యల్లో ఉన్నారంటే ఎంపీ కవిత వెంటనే స్పందిస్తారు. రాత్రి, పగలు అన్న తేడా లేకుండా.. కొత్తగూడెం నుంచి మందమర్రి వరకు క్షణాల్లో వెళ్తారు. సమస్యలకు పరిష్కారం చూపిస్తారు. అలా సింగరేణి కార్మికుల్లో ఎంపీ కవితంటే ఓ భరోసా.
అలాగే సింగరేణి ఎన్నికల్లోనూ ఎంపీ కవిత ప్రతీ బొగ్గుబాయి దగ్గరకు వెళ్లారు. వాస్తవాలను వివరించారు. వారసత్వ ఉద్యోగాలను పోగొట్టింది జాతీయ సంఘాలేనని తెలియజేశారు. కారుణ్య నియామకాల రూపంలో వాటిని తిరిగి తెచ్చే సత్తా సీఎం కేసీఆర్ కే ఉందని స్పష్టం చేశారు. సింగరేణి సిరుల గని కావాలన్నా.. కార్మికుల బతుకులు మారాలన్నా.. ఒక్క ముఖ్యమంత్రితోనే సాధ్యమని తెలిపారు. సింగరేణి బాగు కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న కృషిని వివరించి.. ప్రతీ కార్మికుడిలో భరోసా నింపారు. వాస్తవాలు గ్రహించిన నల్లసూరీళ్లు జాతీయ సంఘాలకు దిమ్మదిరిగేలా బుద్ధి చెప్పారు. ఫలితంగా సింగరేణిపై గులాబీ జెండా సగర్వంగా ఎగిరింది.
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎంపీ కవిత అధికార పార్టీ తరఫున.. ఆరు జిల్లాల పరిధిలోని 11 డివిజన్లలో పర్యటించారు. ఎంపీలు వినోద్ కుమార్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బాల్క సుమన్, పసునూరి దయాకర్, సీతారాం నాయక్, నగేశ్ తోపాటు మంత్రులు కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వర్ రావు, ఈటల రాజేందర్, ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్న తదితరులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ప్రచారంలో పాల్గొన్నారు. వాస్తవానికి ప్రతిసారి బతుకమ్మ పండుగ సమయంలో తెలంగాణ జాగృతి సంస్థ తరఫున బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తుంటారు కవిత. కానీ ఈసారి సింగరేణి కార్మికులతోనే ఎంపీ కవిత ఉత్సవాలు జరుపుకున్నారు. ఎన్నికల ప్రచారానికే అత్యధిక సమయం కేటాయించారు. చివరికి తనదైన శైలి ప్రచారంతో.. 9 డివిజన్లలో అద్భుత విజయాన్ని సాధించారు.