Home / SLIDER / రైతుబంధు ప్రభుత్వం..!!

రైతుబంధు ప్రభుత్వం..!!

అన్నదాత హాయిగా వ్యవసాయం చేయాలంటే తగిన పంట పెట్టుబడికావాలి.. అప్పుల బాధ ఉండకూడదు.. విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలి.. వేసే పంటకు సమృద్ధిగా నీళ్లుకావాలి.. సాగునీరు లేని చోట బోరుబావుల నుంచి తోడుకునేందుకు నాణ్యమైన విద్యుత్ కావాలి.. పండిన పంటను కోసి, మంచి ధర వచ్చేదాకా భద్రపరిచేందుకు గోదాములు కావాలి.. ఆ పంటకు మంచి ధర కల్పించే యంత్రాంగం ఉండాలి.. అనుకోని పరిస్థితుల్లో ఏదైనా జరుగరానిది జరిగితే రైతు కుటుంబం రోడ్డున పడకుండా జీవితాలకు భరోసా ఉండాలి..! సరిగ్గా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న విధంగా!! ప్రతిరంగం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వ్యవసాయంపై ఆధారపడిన మనదేశంలో అన్నం పెట్టే రైతు చల్లగా ఉంటేనే అంతాబాగుండేది. అందుకే.. తెలంగాణ స్వరాష్ట్ర ఫలితాలను అందరికంటే రైతులకే ఎక్కువగా అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వ పాలన సాగుతున్నది. వ్యవసాయ రుణాలమాఫీ అయినా.. పంట పెట్టుబడి అందించిన రైతుబంధు పథకమైనా.. శరవేగంగా పూర్తవుతున్న సాగునీటి ప్రాజెక్టులైనా.. నిరంతర విద్యుత్, పెద్ద సంఖ్యలో గోదాముల నిర్మాణం, రైతు సమన్వయ సమితులు, రైతుబంధు బీమా.. ఏది చూసుకున్నా.. రైతుకే అగ్రతాంబూలం అందుతున్నది. ఎందుకంటే.. ఇది రైతును రాజును చేసే ప్రయత్నంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యం వహిస్తున్న సర్కారు కాబట్టి!!

వ్యవసాయ విప్లవం ముంగిట రాష్ట్రం

మజ్జిగపు శ్రీనివాస్‌రెడ్డి, హైదరాబాద్ : గత ప్రభుత్వాలు వ్యవసాయాన్ని దండుగలా మార్చితే.. దానిని పండగ చేసి చూపుతున్నది తెలంగాణ ప్రభుత్వం. ఎన్నికల సమయంలో ఇచ్చిన రుణమాఫీని సంపూర్ణంగా అమలుచేయడమేకాదు.. మ్యానిఫెస్టోలో చెప్పని అనేక పథకాలతో రైతులకు కొత్త శక్తి అందిస్తున్నది. రైతు అనేవాడు తలెత్తుకు తిరిగేలా అనేక పథకాలు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అమలుచేస్తున్నారు. మరోవైపు గ్రామీణ ముఖచిత్రాన్ని మార్చేందుకు కులవృత్తులకు జీవంపోసి.. వారిని ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తున్న నాలుగేండ్ల టీఆర్‌ఎస్ పాలన రైతన్న జీవితానికి కొత్త నిర్వచనం చెప్పింది. రైతుబంధు పేరిట అమలు చేస్తున్న చెక్కుల పంపిణీ కార్యక్రమం.. తెలంగాణ వ్యవసాయరంగంలో కొత్త విప్లవం సృష్టించేందుకు భూమికను ఏర్పాటుచేసింది. ప్రతి రైతుకు ఎకరానికి నాలుగు వేలు చొప్పున రెండు పంటలకు ఎనిమిది వేల లెక్కన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది రైతుబంధు పేరిట అమలువుతున్న ఈ కార్యక్రమంలో తొలి విడుతలో మే 10 నుంచి 17 వరకు రాష్ట్రవ్యాప్తంగా 58.33 లక్షల మంది రైతులకు చెందిన 1.47 కోట్ల ఎకరాల సాగుభూమికి రూ.5,730 కోట్ల విలువైన 59 లక్షల చెక్కులను, పట్టాదార్ పాస్‌పుస్తకాలను ప్రభుత్వం పంపిణీ చేసింది. పది రోజులపాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు చెక్కులు, బుక్కుల పంపిణీ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. దీనికి ముందే ఏ ప్రభుత్వం చేయని ప్రభుత్వం రికార్డుల ప్రక్షాళన చేపట్టింది.

రైతుబంధు గ్రూప్ బీమా పథకం

తెలంగాణ ప్రభుత్వం రైతులకు అడగకుండానే అందించిన మరో వరం రైతు జీవిత బీమా పథకం. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని దాదాపు 58 లక్షల మంది రైతులకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తూ రూ.5 లక్షల బీమా కల్పించింది.

వ్యవసాయానికి 24 గంటల విద్యుత్

ఉమ్మడి పాలనలో తగిన సాగునీటి ప్రాజెక్టులులేక బోరుబావులపైనే తెలంగాణ వ్యవసాయం అధారపడింది. ఎప్పుడు కరంటు వస్తుందో తెలియని పరిస్థితి ఉండేది. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ల నుంచే రైతులకు రోజుకు 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించిన ప్రభుత్వం.. కరంటు కష్టాలను అధిగమించిన తర్వాత ఈ ఏడాది జనవరి ఒకటి అర్ధరాత్రి నుంచి రాష్ట్రంలోని 23 లక్షల పంపుసెట్లకు 24 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ప్రారంభించింది. దీనికోసం రూ.12,610 కోట్లను ఖర్చు చేస్తున్నది. రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సకాలంలో రాయితీపై పంపిణీ చేస్తున్నది.

వ్యవసాయంలో యాంత్రీకరణకు ప్రోత్సాహం

రైతులకు 50% నుంచి 95% సబ్సిడీపై వ్యవసాయ ట్రాక్టర్లను ప్రభుత్వం అందిస్తున్నది. వ్యవసాయ ట్రాక్టర్లపై రవాణా పన్నును రద్దు చేసింది. మార్చి 2018 నాటికి 13,934 ట్రాక్టర్లను పంపిణీ చేశారు. ట్రాక్టర్లకు బిగించే సేద్య పరికరాలు కూడా పంపిణీ చేశారు. 4.71 లక్షల టార్పాలిన్లు, 26,179 స్ప్రేయర్లు అందించారు. వీటితో పాటు ఒక్కో మండలానికి 10 చొప్పున వరి నాట్లువేసే మిషన్లు కూడా సబ్సిడీపై అందించాలని నిర్ణయించింది. డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం సబ్సిడీపై ఇస్తుండగా, బీసీ, సన్న, చిన్నకారు రైతులకు 90%, ఇతర రైతులకు 85% సబ్సిడీతో అందిస్తున్నారు. 75% రాయితీతో వరిలో ఆడ, మగ విత్తనాలను సరఫరా చేస్తున్నది.

వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు ఊతం

రాష్ర్టానికి కోటి లీటర్ల పాలు అవసరంకాగా.. డెయిరీల ద్వారా మొత్తం ఏడు లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రెండు లక్షల మంది పాడి రైతులకు 50% సబ్సిడీపై బర్రెలను పంపిణీ చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీలకు 75% సబ్సిడీతో అందించనున్నారు. గొర్రెల పంపిణీ పథకం కింద రూ. 3,300 కోట్లతో 75% సబ్సిడీతో 2.75 లక్షల మందికి సుమారు 58.50లక్షల గొర్రెలను పంపిణీ చేసింది. వీటికి 25 లక్షల గొర్రె పిల్లలు పుట్టాయి. వీటిద్వారా దాదాపు గామాల్లో రూ.1000 కోట్ల అదనపు సంపద పోగుపడింది. నాలుగున్నర లక్షల మత్స్యకార కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్రంలోని 4,500 మత్స్యసొసైటీ చెరువులు, 19 వేల గ్రామపంచాయతీ చెరువుల్లో 2016లో 27 కోట్లు, 2017లో 51 కోట్ల చేపపిల్లల విత్తనాలను వదిలారు. వీటితో పాటు ఎంపిక చేసిన 11 రిజర్వాయర్లలో 2017 సంవత్సరానికి 1.08 కోట్ల మంచినీటి రొయ్య విత్తనాలను వదిలారు. రూ.1.34 లక్షల వ్యయంతో రొయ్యల సాగు చేపట్టగా సుమారు రూ.4.43 కోట్ల విలువైన దిగుబడులు సాధించారు. ఇదే స్పూర్తితో 2018లో 74 కోట్ల చేపపిల్లలు, 4.07 కోట్ల రొయ్యల పిల్లలను రాష్ట్రంలోని రిజర్వాయర్లు, చెరువుల్లో వదిలేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మార్కెట్ కమిటీలలో రిజర్వేషన్లు

దేశంలో మరెక్కడా లేనివిధంగా, చరిత్రలో మొదటిసారిగా తెలంగాణలోని అన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులను రిజర్వేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల్లోని రైతులు మార్కెట్ చైర్మన్లు అయ్యే అవకాశం దక్కుతున్నది. మార్కెట్ కమిటీ చైర్మన్లకు గౌరవ వేతనం పెంచారు.

రైతు బజార్లు

తెలంగాణ ఏర్పడే నాటికి కేవలం 30 రైతు బజార్లు ఉండేవి. తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్తగా 18 రైతు బజార్లను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. అత్యాధునిక హంగులతో తొలి మోడల్ రైతు బజార్‌ను సిద్దిపేటలో రూ.8.16 కోట్లతో నిర్మించారు.

రైతు వేదికల ఏర్పాటు

రాష్ట్రంలోని ప్రతీ మూడు గ్రామాలకు కలిపి రైతు వేదికలను రూ.300 కోట్లతో నిర్మించనున్నారు. ఒక్కో రైతు వేదికను రూ.12 లక్షలతో నిర్మించనున్నారు. రైతులు వ్యవసాయాధికారుల, రైతు సమన్వయ సమితి సభ్యులు, శాస్త్రవేత్తలు సమావేశమయ్యేలా ఇవి ఉపయోగపడనున్నాయి. రైతులకు శిక్షణ, అవగాహన కార్యక్రమాలు రైతు వేదికల ఆవరణలో జరుగనున్నాయి.

పాలీహౌజ్, గ్రీన్ హౌజ్

రాష్ట్రంలో చిన్న, సన్నకారు రైతులు కూడా పాలీహౌజ్, గ్రీన్‌హౌజ్ వ్యవసాయానికి ప్రభుత్వం 75% సబ్సిడీ ఇస్తున్నది. ప్రభుత్వ చర్యల వల్ల కూరగాయలు, పండ్లు, పూలు పండించడానికి అనువుగా పాలీహౌజ్, గ్రీన్‌హౌజ్ కల్టివేషన్ పెరిగింది. గత ప్రభుత్వం ఎకరాకు 50% సబ్సిడీ మాత్రమే ఇచ్చేది. తెలంగాణ ప్రభుత్వం విస్తీర్ణ పరిమితిని ఎకరా నుంచి మూడు ఎకరాలకు పెంచింది. గత ప్రభుత్వం తెలంగాణలో కేవలం 129 ఎకరాలకు రూ.24 కోట్ల సబ్సిడీ ఇస్తే.. తెలంగాణ ప్రభుత్వం మార్చి 2018 నాటికి 1150ఎకరాలకు రూ.363 కోట్ల వ్యయంతో పాలీహౌజ్‌లకు పరిపాలనపరమైన అనుమతులు ఇచ్చింది. పంట నాణ్యతను బట్టి గరిష్ఠంగా ఎకరాకు రూ.29.52 లక్షల రుణాన్ని 95% సబ్సిడీతో ఎస్సీ, ఎస్టీలకు, ఇతరులకు 75% సబ్సిడీతో మంజూరుచేస్తున్నారు.

 

వ్యవసాయ యాంత్రీకరణ

వ్యవసాయంలో యాంత్రీకరణ పెంచేందుకు ప్రభు త్వం ఫామ్ మెకనైజేషన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నది. రూ.420 కోట్ల వ్యయంతో రైతులకు ఆధునిక వ్యవసాయ పనిముట్లను సబ్సిడీతో అందిస్తున్నది. ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నది. ఎస్సీ, ఎస్టీ రైతులకు 100% సబ్సిడీతో, ఇతర రైతులకు 50% సబ్సిడీతో వ్యవసాయ పనిముట్లను అందిస్తున్నారు.

తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ

రాబోయే ఐదేండ్లలో తెలంగాణ రైతాంగ ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో 2017 నవంబర్ 4న జరిగిన వరల్డ్ ఫుడ్ ఇండియా -2017లో ఆవిష్కరించారు. ఫుడ్ ప్రాసెసింగ్‌రంగాన్ని వ్యవసాయరంగంతో అనుసంధానం చేయడం లక్ష్యంగా ఈ పాలసీ రూపొందించారు. ముఖ్యంగా చేపల పెంపకం, గొర్రెల పంపిణీ కార్యక్రమాలను ఫుడ్ ప్రాసెసింగ్‌రంగానికి అనుసంధానం చేయనున్నారు. దీనిద్వారా సుమారు రూ.20 వేల కోట్ల పెట్టుబడులు రావడంతోపాటు, 1.25లక్షల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

భారీగా గోదాముల నిర్మాణం

గిట్టుబాటు ధర వచ్చే వరకు రైతులు తమ ఉత్పత్తులను నిల్వ చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున గోదాముల నిర్మాణాన్ని చేపట్టింది. తెలంగాణ వచ్చే నాటికి కేవలం 4.17 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన 176 గోదాములుండేవి. నిజానికి తెలంగాణ వ్యాప్తంగా 29.11 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన గోదాముల అవసరమని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ సర్వేలో తేలింది. దీనికనుగుణంగా కొత్తగా రూ.1024.50 కోట్ల వ్యయంతో 364 ప్రదేశాల్లో 18.30 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన గోడౌన్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. 2018 మార్చి నాటికి 308 గోదాముల నిర్మాణం పూర్తయింది. మిగతా 56 గోదాముల నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేసి, మొత్తం 22.47 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములు అందుబాటులోకి తెస్తున్నారు.

విత్తన భాండాగారంగా తెలంగాణ

ప్రపంచలోనే విత్తనాభివృద్ధికి అనువైన, అత్యుత్తమ నేలలున్న తెలంగాణ దేశానికే విత్తన భాండాగారం (సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా)గా మారనున్నది. వృక్ష సంరక్షణ శాలలు (పాలీహౌజ్‌లు), సూక్ష్మసాగుద్వారా రాష్ట్రంలోని రైతులకు అన్ని విధాల లబ్ధి చేకూరనున్నది. 1300 ఎకరాల్లో రూ. 100 కోట్లతో మూడు సంస్థల నిర్మాణం జరుగుతున్నది. ఫల, వ్యవసాయ, అటవీ పరిశోధనలూ జరుగుతాయి.

రైతు రుణమాఫీ

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలోని రైతులందరికీ రూ.లక్ష లోపు పంట రుణాలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం మాఫీచేసింది. 2014 మార్చి 31 వరకు లక్షలోపు ఉన్న రూ.16,124.37 కోట్ల రుణాన్ని నాలుగు విడుతల్లో మాఫీ చేసి రైతులకు భారీ ఊరట కల్పించింది. దీనివల్ల 35,29,944 మంది రైతులకు ప్రయోజనం కలిగింది. ఆర్థిక పరిస్థితి బాగాలేక, వ్యవసాయానికి పెట్టుబడి పెట్టుకోలేని రైతులకు ప్రభుత్వం వడ్డీలేని రుణాలు, పావలా వడ్డీ రుణాలను అందిస్తున్నది. దీనికోసం 2017-18 బడ్జెట్‌లో రూ. 343.37 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో ఎక్కువమంది ఆధారపడే వ్యవసాయరంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. 2017-18 బడ్జెట్‌లో బ్యాంకుల ద్వారా వ్యవసాయ రుణాల వితరణ లక్ష్యాన్ని రూ.46,946.98 కోట్లుగా నిర్ణయించింది. ఉచిత విద్యుత్‌కు 2017-18 బడ్జెట్లో రూ.4,485 కోట్లు, 2018-19లో రూ.3,728 కోట్లు కేటాయించింది. బడ్జెట్‌లో 26% నిధులను వ్యవసాయ అనుబంధ రంగాలకు కేటాయించింది. అందులో వ్యవసాయానికి రూ.5755.62 కోట్లను కేటాయించారు. 2018-19లో వ్యవసాయ అనుబంధరంగాలకు, గ్రామీణాభివృద్ధికి రూ. 20,820.08 కోట్లు (వ్యవసాయానికి రూ.12 వేల కోట్లు) కేటాయించారు.

రైతుకు గిట్టుబాటు ధర

2016-17లో రికార్డుస్థాయిలో 101.29 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగింది. 2017-18లోనూ 100 లక్షల టన్నుల వ్యవసాయ ఉత్పత్తులు జరిగాయి. 2012-13లో 2638 కేంద్రాలను ఏర్పాటుచేసి, 139.10 లక్షల క్వింటాళ్లు, 2013-14లో 3285 కేంద్రాల్లో 244.20 లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. తెలంగాణ ఏర్పడిన అనంతరం 2014-15లో 3329 కేంద్రాల్లో 242.90 లక్షల క్వింటాళ్లు, 2015-16లో 3007 కేంద్రాల్లో 235.90 లక్షల క్వింటాళ్లు, 2016-17 వానకాలం పంటసీజన్‌లో 2164 కేంద్రాలద్వారా 164.50 లక్షల క్వింటాళ్లు, 2017-18 వానకాలంలో ఎన్నడూలేని విధంగా 5,217 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి, 11 లక్షల మంది రైతుల నుంచి 53.67 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. దీనికోసం రూ. 8,100 కోట్లు ఖర్చు చేశారు. తెలంగాణ ప్రభుత్వం రాకముందు 2010-11లో రూ.1936 కోట్లతో, 2012-13లో రూ.1773 కోట్లతో, 2013-14లో రూ.3678 కోట్లతో అప్పటి ప్రభుత్వం రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేసింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం రూ.3390 కోట్లతో, 2015-16లో రూ.3397 కోట్లతో, 2016-17లో రూ.8083 కోట్లతో కనీస మద్దతు ధర ఇచ్చి రైతులను ఆదుకున్నది. 2018 నుంచి ప్రతీ పంటకు మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat