రంజాన్ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం 33 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, ఇందులో 15కోట్ల రూపాయలు ఇఫ్తార్ విందుకై ఖర్చు చేస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి మహ్మద్ మహమూద్ అలీ తెలిపారు. గురువారం ఇఫ్తార్ విందు ఏర్పాట్లను పర్యవేక్షించడానికై ఎల్బి స్టేడియంలో మైనారిటీ సంక్షేమ శాఖ సలహాదారు ఎ.కె.ఖాన్, వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ మహ్మద్ సలీం, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి దానకిషోర్, వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రంజాన్ పండుగ సందర్భంగా జూన్ 8 న ఎల్బి స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇచ్చే ఇఫ్తార్ విందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఉపముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 800 మసీదులకు గాను ఒక్కొక్క మసీదుకు 500 గిఫ్ట్ ప్యాకులను (బట్టలను) అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. నగరంలోని 400 మసీదులు, వివిధ జిల్లాలలోని 400 మసీదులకు ఈ గిఫ్ట్ ప్యాకులను అందిస్తున్నామన్నారు. ప్రతి మసీదుకు ఇఫ్తార్ విందుకై లక్ష రూపాయలు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మైనారిటీల సంక్షేమానికై బడ్జెట్ లో అధిక నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో మొదటి స్ధానంలో ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇఫ్తార్ విందుకు వచ్చే అతిధులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఎల్బి స్టేడియంలో అన్ని ఏర్పాట్లు చేయాలని, ముఖ్యంగా బారికేడ్లు, మంచినీటి సరఫరా లతో పాటు శానిటేషన్, తాత్కాలిక టాయిలేట్లు ఏర్పాటు చేయాలన్నారు. ఇఫ్తార్ విందు సందర్భంగా విద్యుత్ కు అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ఇఫ్తార్ విందులో పాల్గొననున్న ముఖ్యఅతిధులు, ప్రజాప్రతినిధులకు ఎల్.బి.స్టేడియం దగ్గర బందోబస్తుతో పాటు వాహనాల పార్కింగుకై తగు ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులను ఆయన ఆదేశించారు. ఇఫ్తార్ విందు సందర్భంగా ఎల్బి స్టేడియంలో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ తో పాటు ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేయాలని సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులను ఉపముఖ్యమంత్రి ఆదేశించారు.