శ్రీలంక క్రికెటర్ ధనుంజయ డిసిల్వా తండ్రి రంజన్ దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తి గురువారం అర్ధరాత్రి రంజన్‌పై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో రంజన్ ప్రాణాలు కోల్పోయారు. దీంతో శుక్రవారం ఉదయం వెస్టిండీస్ పర్యటనకు వెళ్లాల్సిన లంక జట్టు నుంచి ధనుంజయ తప్పుకున్నాడు. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం శ్రీలంక జట్టు వెస్టిండీస్‌కు బయల్దేరాల్సి ఉంది.
స్థానిక రాజకీయవేత్త అయిన రంజన్‌పై కొలంబో శివారు ప్రాంతంలోని రత్మలానా వద్ద దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో రంజన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దీనిపై విచారణ చేపట్టామని, ఇప్పటి వరకు ఎవర్ని అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు. తండ్రి మరణంతో ధనుంజయ వెస్టిండీస్ వెళ్లే లంక జట్టు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.
అతని స్థానంలో ఎవర్ని వెస్టిండీస్ పర్యటనకు పంపిస్తున్నారో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించలేదు. ఇప్పటికే చేతి వేలి గాయం కారణంగా ఓపెనర్ దిముత్ కరుణరత్నే ఈ పర్యటనకు దూరమైన సంగతి తెలిసిందే. జూన్ 6 నుంచి శ్రీలంక-వెస్టిండీస్ మధ్య మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభంకానుంది.