ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ఈ పాదయాత్ర 170వ రోజు ప్రారంభమైంది. గురువారం ఉదయం ఉంగుటూరు నియోజకవర్గంలోని సరిపల్లి శివారు నుంచి రాజన్న బిడ్డ పాదయాత్ర ప్రారంభించారు. జగన్ తో పాటు ఉదయం నుండే వేల మంది అడుగులో అడుగు వేస్తున్నారు. జగన్ కూడ వారితో ఉత్ఫాహంగా పాదయాత్రను ముందుకు కొన సాగిస్తున్నారు. అనంతరం ఉండి నియోజకవర్గంలోని ఆరేడు, ఉప్పులూరు క్రాస్ రోడ్డు, పాములపర్రు, వెంకటరాజుపురం మీదుగా పెదకాపవరం వరకూ పాదయాత్ర కొనసాగిస్తారు.వైఎస్ జగన్ తో ప్రజలు తమ సమస్యలను ఏకరవు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి ఆసరా లభించడం లేదని అవ్వ-తాతలు వాపోతున్నారు. అధికారంలోకి వస్తే ఇంటికి ఉద్యోగం కల్పిస్తామని బాబు తమను మోసం చేశారని నిరుద్యోగులు వైఎస్ జగన్తో విన్నవించుకున్నారు. పంటలకు సరైన మద్దతు ధర లభించడం లేదని రైతులు వాపోయారు. వారి సమస్యలను విన్న జననేత, త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందని భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు.
