వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నిత్యం ప్రజల ఆదరణాభిమానాలతో విజయవంతంగా కొనసాగుతోంది. పాదయాత్ర ద్వారా జగన్ ఎక్కడ కాలు పెట్టినా ఆ ప్రాంత ప్రజలు జగన్ చుట్టూరా చేరి ఆప్యాయంగా పలుకరిస్తున్నారు. అంతేకాకుండా, చంద్రబాబు సర్కార్ పాలనలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను జగన్‌కు వివరిస్తున్నారు. అర్జీల రూపంలో తెలియజేస్తున్నారు. వృద్ధులయితే తమకు వస్తున్న పింఛన్‌ను టీడీపీ నేతలు, నాయకులు, కార్యకర్తల స్వాహా అవుతుందని జగన్‌కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగులు అయితే చంద్రబాబు సర్కార్ ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా వదల్లేదని జగన్‌కు చెప్పుకుని విలపిస్తున్నారు. వారందరికి జగన్ భరోసా కల్పిస్తూ ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ముందుకు సాగుతున్నారు.
ఇదిలా ఉండగా.. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పశ్చిగోదావరి జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై పంచ్‌ల వర్షం కురిపించాడు.
కర్ణాటకలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుంటే చాలా బాధగా ఉందంటూ చంద్రబాబు ట్వీట్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కర్ణాటకలో వాళ్లు చేసింది తప్పయితే.. ఏపీలో వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన నిన్నేమనాలి అంటూ జగన్ చంద్రబాబును ప్రశ్నించారు.
మూడు రోజుల కిందట రూ.13 వేల కోట్ల నిధుల మేర రైతు రుణాలను మాఫీ చేసినట్లు చెప్పారు. మళ్లీ అదే చంద్రబాబు నాయుడు విశాఖలో ధర్మపోరాటం పేరిట నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ రూ.24వేల కోట్ల మేర రైతు రుణాలను మాఫీ చేసినట్లు చెప్పుకొచ్చారని, ఊసరివెల్లికంటే చంద్రబాబు రంగులు బాగా మార్చగలరంటూ జగన్ విమర్శించారు.
బ్రిటీష్ ప్రభుత్వంపై పోరాటం చేసిన వారిలో తెలుగుదేశం పార్టీ కూడా ఉందని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఆ రోజుల్లో గనుక ఉండి ఉంటే స్వాతంత్య్రం వద్దు ప్యాకేజీ చాలు అని చెప్పి ఉండేవాడని జగన్ చంద్రబాబుపై పంచ్ పేల్చాడు.
జీవితంలో ఏదో ఒకటి సాధించాలన్న ఉన్నతాశయంతో సాధన చేసి లక్ష్యాలను సాధించిన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెండ్ల, పీవీ సింధులను కూడా చంద్రబాబు వదలకుండా తన స్ఫూర్తితోనే వారు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగారని చెప్పుకుంటూ చంద్రబాబు కాలం గడుపుకుంటున్నారన్నారు.
మరోపక్క జిల్లాల కలెక్టర్లకు చంద్రబాబు ఫోన్ చేసి ఎండవేడిమిని పది శాతం తగ్గించాలని ఆదేశిస్తాడని, వెన్నుపోటు పొడవటం చంద్రబాబుకు వెన్నతోపెట్టిన విద్య అంటూ వైఎస్ జగన్ చంద్రబాబుపై పంచ్‌ల వర్షం కురిపించాడు.