ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలనను గాలికొదిలేశారని ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. సోమవారం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం చెరుకులపాడులో వైసీపీ నేత దివంగత చెరుకులపాడు నారాయణరెడ్డి వర్ధంతి నిర్వహించారు. నారాయణరెడ్డి భార్య కంగాటి శ్రీదేవి ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభలో వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడారు. నీతి, నిజాయితీ కలిగిన రాజకీయ నాయకుడు చెరుకులపాడు నారాయణరెడ్డి అని ,అలాగే స్నేహశీలి, ప్రేమాభిమానాలు కలిగిన వ్యక్తి అంటూ ఆయనతో తన అనుబంధాన్నిఅంబటి రాంబాబు తెలియజేశారు. చంద్రబాబు సీఎం పదవిని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారే తప్ప ప్రజాశ్రేయస్సును అసలు పట్టించుకోవడం లేదన్నారు. హత్యలు, దోపిడీలు, మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు, రోడ్డు, బోటు ప్రమాదాలు జరుగుతున్నా స్పందించడం లేదన్నారు. రాబోవు ఎన్నికల్లో ఓటును వేల రూపాయలతో కొనేందుకు చంద్రబాబు ముందుకు వస్తారన్నారు. అంతేకాదు ఇక్కడ ప్రజలు టీడీపీ నేతలు ఇంటికి కోటి ఇచ్చిన ఓటు మాత్రం వైసీపీకే వేస్తాం అని నారయణ రెడ్డి అభిమానులు చేప్పారు. అందుకే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ప్రజల కోసం నిత్యం శ్రమిస్తున్న వైఎస్ జగన్ని ముఖ్యమంత్రి చేసుకోవాలని పిలుపునిచ్చారు. చంద్రబాబును జైలుకు సాగనంపే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.
