మమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో కలిపేసుకోండి.. మీ పథకాలు మాకూ అమలు చేయండి. ఇది మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల ప్రజల కోరిక. తాము కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనలో ఉండాలని వారు ఆకాంక్షిస్తున్నారు. ము ఖ్యంగా ఇదివరకు హైదరాబాద్ రాష్ట్రంలో ఉండి రాష్ర్టాల పునర్విభజనలో మహారాష్ట్రలో కలిసిపోయిన గ్రామాల ప్రజలు తమను తెలంగాణలో కలిపేయాలని కోరుకుంటున్నారు. మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు సరిహద్దు గ్రామాల సర్పంచ్‌లు తమ గ్రామాలను తెలంగాణ రాష్ట్రంలో విలీనం చేసుకోవాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు.
బాబ్లీ పరిసర గ్రామాల సర్పంచ్‌లు రాసిన లేఖ బుధవారం నిజామాబాద్ ఎంపీ కవితకు చేరింది. ఈ లేఖను సీఎం కేసీఆర్‌కు అందజేస్తామని జక్రాన్‌పల్లి రైతుబంధు సభలో ఎంపీ కవిత వెల్లడించారు. పాత తెలంగాణలోనే మేముంటాం.. మమ్మల్ని కలుపుకోండి అని రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న మహారాష్ట్ర సర్పంచ్‌లు కోరుతున్నారని ఎంపీ కవిత తెలిపారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని 40 గ్రామాల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు బాబురావు నేతృత్వంలో కొంతమంది సర్పంచ్‌లు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ను కలిసి లేఖను అందించారని వివరించారు.
సీఎం కేసీఆర్ చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా, నాణ్యమైన విత్తనాలు, కల్తీలేని ఎరువుల సరఫరా, వ్యవసాయ పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు గోడౌన్ల సామర్థ్యం పెంపు వంటి అంశాలు మహారాష్ట్ర రైతులను ఆకర్షించాయని చెప్పారు. రైతుబంధు కింద ఎకరాకు రూ. 4 వేల చొప్పున రెండు పంటలకు రూ. 8 వేలు సీఎం కేసీఆర్ ఇస్తున్న విషయం తెలుసుకున్న బాబ్లీ ప్రాంత మహారాష్ట్ర రైతులు తమ ప్రభుత్వం కూడా పంట సహాయం అందిస్తే బాగుండునని కోరుతున్నారని పేర్కొన్నారు.
మహారాష్ట్రలో ధాన్యం కొనుగోలు చేసి ఆరునెలలైనా రైతులకు డబ్బులు ఇవ్వకపోవడం, శనగలు కొనుగోలు చేసే దిక్కులేకపోవడం, కరెంటు రెండుమూడు గంటలే ఇవ్వడం వంటి కారణాలను ఆ లేఖలో పొందుపర్చినట్టు తెలిపారు. అందుకే తెలంగాణలో కలిపేసుకోవాలని కోరుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఆ రైతుల లాగానే దేశంలోని రైతులంతా పార్టీలను నిలదీసే రోజులు వస్తాయని ఎంపీ కవిత అన్నారు.