సినీ నటుడు హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ వైఖరిపై ఆ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తనలోని ఆవేశాన్ని అణచుకోవడం చేతకాక, ఎక్కడ పడితే అక్కడ అభిమానుల చెంపలు చెళ్లుమనిపిస్తున్నారు బాలయ్య. దండెయ్యడానికొచ్చినా.. దండంపెట్టడానికొచ్చినా.. అభిమానుల పట్ల బాలయ్య బాబుది ఒకటే రియాక్షన్. అయితే ఇటీవలి కాలంలో బాలయ్య బహిరంగంగా తన అభిమానులపై చెయ్యి చేసుకున్న ఘటనలు వరుసగా జరుగుతుండటంతో వారు టీడీపీ నేతలు కలవరపడుతూ తమలోని అసంతృప్తిని బహిరంగానే వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో, వీటిని ఎలా సమర్థించుకోవాలో తెలియని స్థితిలో తెలుగు తమ్ముళ్ళు ఉన్నారు. పైగా, సీఎంకు బామ్మర్ధి కావడంతో పాటు సినీ హీరో అయినందువల్ల ఇలా చేయవద్దని ఆయనకు చెప్పలేకపోతున్నామని.. ఇక చంద్రబాబే బాలయ్యతో మాట్లాడాలని పార్టీ సీనియర్ ఎంపీ ఒకరు వ్యాఖ్యానించారు. రీల్ లైఫ్‌లో పంచ్ డైలాగులు, ఫైట్స్‌తో సినిమాల్లో తన అభిమానులను అలరించే బాలకృష్ణ,.. రియల్ లైఫ్‌లో ఇలా తనపై అభిమానం చూపే వారిమీద సంయమనం కోల్పోయి చెయ్యి చేసుకోవడం పార్టీపై చెడు ప్రభావాన్ని చూపిస్తోందని వ్యాఖ్యానిస్తున్న వారి సంఖ్య టీడీపీలో క్రమంగా పెరుగుతోంది. పూలదండ వేయాలని వచ్చిన వారిని, సెల్ఫీ దిగాలని భావించిన వారిని కొట్టడం మంచిది కాదని వారు హితవు పలుకుతున్నారు.