వల్లభనేని వంశీ మోహన్. కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే, అలాగే, విజయవాడ నగరం టీడీపీ అధ్యక్షులు కూడాను. 2014 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దుట్టా రామచంద్రరావుపై కేవలం 9,500 ఓట్ల తేడాతో వల్లభనేని వంశీ ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే. అంతేకాకుండా, 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్‌పై విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన అపజయం పాలయ్యారు. దివంగత టీడీపీ నేత పరిటాల రవి అనుచరుడిగా రాజకీయాల్లోకి వచ్చిన వంశీ.. టీడీపీలోనే పుట్టి.. పెరిగిన నేతగా పేరుంది. అటువంటి వల్లభనేని వంశీ ప్రస్తుతం రాజకీయంగా గడ్డుకాలం ఎదుర్కొంటున్నారు.
అయితే, నందమూరి, నారా వారి కుటుంబాలను రెండు కళ్లుగా భావించే ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఇటీవల కాలంలో నారా వారి కుటుంబ అనుచరులతో తీవ్ర స్థాయిలో విభేదాలు తలెత్తుతున్నాయి. దీంతో చంద్రబాబుకు, వల్లభనేని వంశీకి మధ్చ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందట. అంతేకాకుండా, దివంగత రాజకీయ నేత దేవినేని నెహ్రూకు, వల్లభనేని వంశీల మధ్య గతంలో తలెత్తిన ఘర్షణల్లో కూడా మంత్రి దేవినేని ఉమా పాత్ర ప్రముఖంగా ఉందన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ఒకానొక సమయంలో మంత్రి దేవినేని ఉమ దగ్గరుండి మరీ వల్లభనేని వంశీపై కేసు పెట్టించారనే టాక్ దావానంలా వినిపించింది. ఇక అప్పట్నుంచే వంశీకి సీఎం చంద్రబాబుతో సహా టీడీపీ నేతల మధ్య వైరం పెరిగింది. అంతేకాకుండా, ఆ సందర్భంలోనే ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తనకు ప్రభుత్వం కేటాయించిన బాడీగార్డ్‌లను సైతం వెనక్కి పంపించి తనకు తానుగా పోలీస్ స్టేషన్‌లో లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు. అప్పటి వరకు చంద్రబాబుతోనే ఉన్న మనస్ఫర్ధలు.. మంత్రి దేవినేనితో కూడా ప్రారంభమయ్యాయి. ఈ కారణాన్నే చూపి విజయవాడ నగర పరిధిలో జరుగుతున్న టీడీపీ కార్యక్రమాలకు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గైర్హాజరవుతున్నారు.
వల్లభనేని వంశీకి, గుడివాడ ఎమ్మెల్యే నానికి మంచి సంబంధాలు ఉండటం, వారిద్దరు కూడా నటరుద్రుడు ఎన్టీఆర్‌కు సన్నిహితులు కావడం మరో విశేషం. అంతేకాకుండా, ఎమ్మెల్యే నాని వైసీపీలో చేరే సమయంలో వంగవీటి రాథాతోపాటు వల్లభనేని వంశీలు కలిసి చర్చలు జరిపారని, ఆ నేపథ్యంలోనే వంగవీటి రాధ, నానిలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారన్నది జగమెరిగిన సత్యం. అన్నిటికి మించి విజయవాడ నడిబొడ్డున వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి ఆప్యాయంగా కౌగలించుకోవడం, ఇప్పటికే టీడీపీకీ ఏపీలో ఎదురు గాలులు వీస్తుండటం, రాజధానికి సమీపంలో ఉన్నా గన్నవరం నియోజకవర్గంలో అభివృద్ధి కనిపించకపోవడం, వంశీ పట్ల సీఎం చంద్రబాబు అనుమానంగా ప్రవర్తించడం, సొంత పార్టీ నేతలతో వైరం నేపథ్యంలో వంశీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వంశీ తన చిరకాల మిత్రుడు నానితో మళ్లీ చర్చలు జరిపి వైసీపీలో చేరి సునాయాసంగా విజయం సాధించాలని చూస్తున్నారు.