ఏపీ సీఎం చంద్రబాబుకు తోడల్లుడు.. అన్న నందమూరి తారకరామారావు పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఫ్యామిలీ..ఫ్యామిలీ వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారా? ప్రతిపక్ష నేత జగన్ చెంతకు చేరనున్నారా? దీనికి సంబంధించి ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయా? అంటే ఔననే అంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. ఇటీవల జరిగిన పరిణామాలు దగ్గుబాటి రాజకీయ అడుగులపై తీవ్ర చర్చకు దారితీశాయి. వాస్తవానికి దగ్గుబాటి రాష్ట్ర రాజకీయాలకు కొత్తకాదు. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో దగ్గుబాటి ఫ్యామిలీ గురించి మనందరికీ తెలిసిందే.
దివంగత నందమూరి తారకరామావు కుమార్తె, దగ్గుబాటి పురందేశ్వరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పనిచేయగా, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్రమంత్రిగా పనిచేశారు. ఇంక ఒకసారి ఎంపీతో పాటు రాజ్యసభ సభ్యుడుగా కూడా బాధ్యతలు నిర్వహించారు …అన్నగారి కూతురు పురందేశ్వరి కేంద్రంలో మంత్రిగా చక్రం తిప్పారు. అయితే, గత కొన్నాళ్లుగా దగ్గుబాటి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కానీ, పురందేశ్వరి మాత్రం యాక్టివ్ పాలిటిక్స్ చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం 2019 ఎన్నిక ల హడావుడి అప్పుడే మొదలైంది. ముఖ్యంగా ఏపీలో అటు చంద్రబాబు, ఇటు వైఎస్ జగన్‌లు 2019 ఎన్నికలే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. కొందరికి సీట్ల పంపకాలు, టికెట్ల హామీలు కూడా ఇచ్చేశారని సమాచారం. ఈ నేపథ్యంలో దగ్గుబాటి పొలిటికల్‌గా మరోసారి అరంగేట్రం చేసేందుకు పావులు కదుపుతున్నారని తెలుస్తోంది.
అయితే తన తనయడు దగ్గుపాటి చెంచురామ్ పోలిటికల్ ఎంట్రీ కోసం దగ్గుపాటి దంపతులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెపథ్యంలో జగన్ నుంచి దగ్గుపాటి ఫ్యామిలీకి రెండు ఆఫర్లు వెళ్లినట్టు తెలుస్తోంది. చెంచురామ్‌కు పర్చూరు అసెంబ్లీ టికెట్.. పురందేశ్వరికి కోస్తాలో ఎంపీ సీటు ఇస్తామన్నహామీ జగన్ నుండి వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ భాగా పట్టున్న దగ్గుబాటి ఫ్యామిలీ నుండి చెంచురామ్ ని తెర మీదకు తీసుకుని వస్తే.. అక్కడి రాజకీయ వాతావరణమే పూర్తిగా వైసీపీకి అనుకూలంగా మారిపోతుందని అంటున్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు. అంతేకాదు వైసీపీలోకి దగ్గుపాటి దంపతులు చేరితే.. ఏపీ రాజకీయాల్లో సంచలనమే. ఇక వైసీపీకి తిరుగేలేదని ఏపీ మొత్తం చర్చించుకుంటున్నారు.