కేంద్ర ఎన్నికల సంఘం సంచలన ప్రకటనను చేసింది .దీనిలో భాగంగా వచ్చే ఏడాది సెప్టెంబర్ తర్వాత నుంచి ఒకేసారి దేశ వ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.ఇలా ఒక్కసారే దేశ వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించడం వలన రూ. వందల కోట్ల ఖర్చు తగ్గుతుందని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ మీడియాకు తెలిపారు .
నిన్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్‌వో) నెట్‌వర్క్ వెబ్ యాప్‌ను సీఈసీ కమిషనర్ రావత్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి సంబంధించి ఎన్నికల సంఘానికి ఏం కావాలో మేం ప్రభుత్వానికి వివరించాం. ఈవీఎంలు తదితర అంశాల గురించి చర్చించాం. అంతేగాక ఇందుకు ఎంత డబ్బు అవసరమో కూడా చెప్పాం. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలంటే 40లక్షల ఎన్నికల సంబంధిత పరికరాలు కావాలి.
వీవీపాట్(వోటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్)ల కోసం రూ.3,400కోట్లు, ఈవీఎంల కోసం రూ.12వేల కోట్లు ఖర్చు అవుతుంది.’ అని రావత్ అన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఇందుకు సంబంధించి నిధులు అందించడంతో అదనపు పరికరాల కోసం ఆర్డర్లు కూడా ఇచ్చినట్లు రావత్ పేర్కొన్నారు. సెప్టెంబర్ 2018 నాటికి అన్ని పరికరాలు అందుబాటులోకి వస్తాయని, అప్పుడు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు తాము సన్నద్ధంగా ఉంటామని తెలిపారు.ఏకకాలంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఇటీవల కేంద్రప్రభుత్వం ప్రతిపాదన తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గతేడాది నవంబర్‌లో ప్రధాని మోదీ ఈ ప్రతిపాదన చేశారు. దీనివల్ల కోట్లాది రూపాయాలు ఆదా అవడమేగాక, ఎంతో సమయం కూడా కలిసివస్తుందని ఆయన అన్నారు.