ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయం వేడెక్కింది.ఎన్నికలు సమీపిస్తున్న తరణంలో ప్రస్తుత అధికార టీడీపీ పార్టీ నుండి వైసీపీ పార్టీలోకి వలసలు జోరందుకున్నా యి.ఇప్పటికే పలువురు నేతలు టీడీపీ పార్టీ నుండి వైసీపీలో చేరగా..తాజాగా మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు తనయుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త వసంత కృష్ణప్రసాద్ వైసీపీ లో చేరబోతున్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు పారిశ్రామికవేత్త కృష్ణప్రసాద్ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో సీటు ఇచ్చినా, ఇవ్వకపోయినా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచు కుంటానని చెప్పారు. ఐతవరంలోని స్వగృహంలో విలేకరుల సమావేశంలో రాజకీయ నిర్ణయాన్ని వెల్లడించారు. గత ఎన్నికల్లో పెద్దల ఒత్తిడిపై టీడీపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేశానని తెలిపారు. టీడీపీలో సభ్యత్వం లేదని, రాజీనామా చేయాలనే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. రాజకీయాల్లో చురుకుగా పాల్గొనాలని నిర్ణయించుకున్నానని, ముఖ్యమంత్రి పిలిచి మాట్లాడారని వచ్చే ఎన్నికల్లో గుంటూరులో అవకాశం ఇస్తామని చెప్పారన్నారు. కాని వైఎస్ జగన్, వైవీ సుబ్బారెడ్డి కుటుంబాలతో సాన్నిహిత్యం ఉందని వైసీపీతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాని చెప్పారు. ఆలోచన మార్చుకునే ప్రసక్తే లేదన్నారు.
