తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు దేశ వ్యాప్తంగా భారీ స్పందన లభిస్తున్నది . కేసీఆర్ ఆలోచనలు , ఈ దేశం వేగంగా అభివృద్ధి చెందకపోవడానికి ఆయన చెబుతున్న కారణాలు , చూపిస్తున్న గణాంకాలు ప్రతి ఒక్కరిని ఆలోచనలో పడేస్తున్నాయి . కాంగ్రెస్ , బీజేపీ ల వైఫల్యాల మీద కూడా జనం విసిగిపోయి ఉండడంతో ఆయన వాస్తవానికి దగ్గరగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయంలో సరైన సమయంలో సరైన తీసుకుని మంచి ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయమే ఎక్కువగా వినిపిస్తున్నది . పైగా సుదీర్ఘ ఉద్యమ అనుభవంతో పాటు తెలంగాణ కొత్త రాష్ట్రాన్ని నాలుగేళ్లలోనే అభివృద్ధిలో గాడిలో పెట్టి దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న నాయకుడు ఆయన . ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే ఆయన ప్రతి ఒక్కరిని గౌరవించే విధానం , కల్మషం లేకుండా ప్రేమగా మాట్లాడే తీరు ఎవ్వరినైనా కట్టి పడేస్తుంది . ఫలితం గురించి ఆలోచించకుండా ఒక సంకల్ప బలంతో పని చేసుకుంటూ పోవడం ఆయన ప్లస్ పాయింట్ . ఇప్పుడు జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయంలోనూ అదే పంధాను అనుసరిస్తున్నారు .
ప్రాంతీయ పార్టీల నేతలతో సంప్రదింపుల కోసం ఆయన వెళుతున్న ప్రతి చోట భారీ స్పందన లభిస్తున్నది . నిన్న చెన్నై లో డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ తో చర్చించడానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడి ప్రజలు బ్రహ్మరథం పట్టారు . ‘దేశ్ కీ నేత కేసీఆర్ ‘ అంటూ స్టాలిన్ ఇంటి ముందే కిక్కిరిసిన జాతీయ మీడియా సమక్షంలో నినదించారు . స్టాలిన్ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఘనంగా స్వాగతం పలికి ఆతిధ్యమిచ్చారు . మాజీ ముఖ్యమంత్రి కరుణానిధితో మర్యాదపూర్వక భేటీ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ తో స్టాలిన్ చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయి . ఫెడరల్ ఫ్రంట్ అవసరమనే అభిప్రాయంతో స్టాలిన్ ఏకీభవించారు . కేంద్రం నుండి రాష్ట్రాలకు చాలా వరకు అధికారాలు బదిలీ కావాలనే అంశాలతో సహా చాలా విషయాలను స్టాలిన్ అంగీకరించినట్లు సమాచారం . ఆ తర్వాత చెన్నై లోనే ముఖ్యమంత్రి కేసీఆర్ తో స్టాలిన్ సోదరి ఎంపీ కనిమొళి సహా పలువురు పారిశ్రామికవేత్తలు భేటీ అయ్యారు . మొత్తానికి సీఎం కేసీఆర్ చెన్నై పర్యటన విజయవంతమైంది .
ఈ వారంలోనే యూపీ మాజీ సీఎం అఖిలేష్ , ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చలు జరిపే అవకాశం ఉంది . అయితే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ సక్సెస్ అవడాన్ని జీర్ణించుకోలేక కాంగ్రెస్ నాయకులు చిల్లర విమర్శలకు దిగుతున్నారు . ఒకప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలోనూ కేసీఆర్ పై ఇలాగే హేళనగా విమర్శలు చేశారు . ఆ విషయంలో ఆయన సక్సెస్ అయినట్లుగానే ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ విషయంలోనూ సక్సెస్ అవుతారని ఆయన పట్టుదల గురించి తెలిసిన వారు చెబుతున్నారు . ఇక కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఆలోచన పై ఆంధ్రా మీడియా కూడా ఓర్వలేక కుళ్ళు రాతలు రాస్తున్నది . ఫెడరల్ ఫ్రంట్ సక్సెస్ అయితే తెలంగాణ , ఆంధ్రా సహా దేశంలోని అన్ని రాష్ట్రాలకు మేలు జరుగుతుందనే కనీస సోయి లేకుండా ఆంధ్రాకు చెందిన కొన్ని మీడియా సంస్థలు ప్రవర్తిస్తున్నాయి .