టాలీవుడ్ హీరో మంచు విష్ణుకు ఇటీవల రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘ఆచారి అమెరికా యాత్ర’. జి. నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వం వహించారు. ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్ . ఈ సినిమా షూటింగ్ మలేషియాలో జరుగుతుండగా ఓ యాక్షన్ సన్నివేశాల్ని తెరకెక్కించారు. ఈ సమయంలో విష్ణు ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనంపై నుంచి కిందపడ్డారు. కాలికి, భుజానికి గాయాలయ్యాయి. ఆయన వెనుక కూర్చున్న ప్రగ్యాకు కూడా స్వల్ప గాయాలయ్యాయి.
కాగా ఈ షూట్‌కు సంబంధించిన వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. దీన్ని విష్ణు ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ‘స్టంట్స్ ఎల్లప్పుడూ సురక్షితంగా జరగవు. టైం బాగాలేకపోయి ఉంటే తలకు తీవ్ర గాయాలు అయ్యేవి’ అని ట్వీట్ చేశారు. పక్కన వెళ్తున్న బైక్.. విష్ణు బైక్‌పై పడటంతో ఈ ప్రమాదం జరిగింది. పద్మజా పిక్చర్స్ పతాకంపై కీర్తి, కిట్టు సినిమాను నిర్మించారు. ఏప్రిల్ 27న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తమన్ బాణీలు అందించారు. బ్రహ్మానందం, అనూప్ సింగ్ ఠాకూర్ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. ప్రియురాలి ప్రేమను గెలుచుకోవడానికి అమెరికాలో వెళ్లే యువకుడి కథ ఇది.