దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అనుచరుడు, టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి, భూమా నాగిరెడ్డి కుమార్తె, మంత్రి అఖిల ప్రియ మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. అయితే. కొంత కాలం నుంచి కర్నూలులో రాజకీయ ఆధిపత్యం కోసం వీరిరువురి మధ్య అంతర్గత రాజకీయ యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఒకానొక సమయంలో బహిరంగ సభలు పెట్టి మరీ.. వారి బలా బలాలను చూపించుకోవడంతోపాటు బహిరంగంగా ఒకరిపై మరొకరు విమర్శల వర్షం కురిపించారు. నువ్వెంత… నీ బతుకెంత అని ఒకరంటే.. నీ రాజకీయాన్ని పతనం చేస్తానంటూ మరొకరు విమర్శించం పరిపాటిగా మారింది.
అయితే, గత ఆదివారం ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఏవీ సుబ్బారెడ్డి సైకిల్ యాత్ర చేస్తున్న సమయంలో.. మంత్రి అఖిల ప్రియ వర్గీయులు రాళ్లదాడి చేసిన విషయం తెలిసిందే. తన రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేకే అఖిల ప్రియ.. నేను చేస్తున్న సైకిల్ యాత్రను అడ్డుకునేందుకు తన వర్గీయులతో రాళ్లతో దాడి చేయించిందని ఏవీ సుబ్బారెడ్డి మీడియా ముఖంగా వెల్లడించారు. అంతేకాకుండా, మంత్రి అఖిల ప్రియపై కేసు నమోదు చేసేందుకు వెళ్లిన ఏవీ సుబ్బారెడ్డికి పెద్ద ఎదురు దెబ్బే తగిలింది. అఖిల ప్రియపై కేసు ఫైల్ చేయమని ఏవీ సుబ్బారెడ్డి కోరగా.. అందుకు నిరాకరించిన పోలీసులు.. పోలీసులనే సాక్ష్యాలుగా చూపిస్తూ కేసు నమోదు చేశారు.
ఏదేమైనా.. ఇప్పటికే జిల్లాలో పట్టు కోల్పోయిన ఏవీ సుబ్బారెడ్డి.. తనపై దాడి చేసిన మంత్రి అఖిల ప్రియపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా.. పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. మరో పక్క మంత్రి అఖిల ప్రియ వర్గం మాత్రం ఏవీ సుబ్బారెడ్డిపై దాడులకు పాలపడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఏవీ సుబ్బారెడ్డి టీడీపీలో ఉంటే తనకు రక్షణ ఉండదనే క్రమంలో.. వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారంటూ ఆళ్లగడ్డలో గుసగుసలు వినవస్తున్నాయి. అందులో భాగంగా వైసీపీ నేతలతో ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నారని, త్వరలో జగన్ సమక్షంలో వైసీపీలో చేరే అవకాశం ఉందన్నది ఆళ్లగడ్డ ప్రజల ఆంతర్యం.
ఇదిలా ఉండగా.. ఇటీవల ఏవీ సుబ్బారెడ్డి కుమార్తె జశ్వంతి మీడియాతో మాట్లాడుతూ.. మా నాన్న సైకిల్ ర్యాలీకి వెళ్లినప్పుడు అఖిల ప్రియ వర్గీయులు దాడి చేశారు. మా నాన్న 30 సంవత్సరాలు భూమా నాగిరెడ్డి కుటుంబానికి సేవ చేశారు. మామా.. మామా అంటూ మా నాన్నను పిలుస్తావే.. 30 సంవత్సరాలు మీ కుటుంబానికి చేసిన సేవకు గాను.. మా నాన్నపైనే రాళ్లతో దాడి చేయిస్తావా..? అంటూ ప్రశ్నించింది. మా నాన్నకు ఏమన్నా జరిగితే.. నీవు బాధ్యత తీసుకుంటావా అంటూ అఖిల ప్రియను జశ్వంతి సూటిగా ప్రశ్నించింది. త్వరలోనే నీ రాజకీయ ఓటమికి మా నాన్న (ఏవీ సుబ్బారెడ్డి) స్పాట్ పెట్టాడంటూ మీడియా ముఖంగా చెప్పంది జశ్వంతి.