వచ్చే ఎన్నికల నాటికి ప్రతీ ఇంటికి నల్లా ద్వారా సురక్షిత మంచినీరు ఇవ్వకుంటే ఓట్లు అడగబోమని తమకు తాముగా స్వీకరించిన సవాల్ కు కట్టుబడి మిషన్ భగీరథ పనులను అనుకున్న విధంగా పూర్తి చేస్తున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. మెయిన్ గ్రిడ్ పనులు 95 శాతం పూర్తయ్యాయని, మొత్తం ప్రాజెక్టు 75 శాతం పూర్తయిందని, గ్రామాల్లో అంతర్గత పైపులైన్ల నిర్మాణం చేపట్టి నల్లాలు బిగించే పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకన్నా నాలుగైదు నెలల ముందే మిషన్ భగీరథ పథకాన్ని పూర్తి చేసి ప్రతీ ఇంటికి మంచినీటి సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు. ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు, ఏజన్సీ ప్రాంతాలున్న జిల్లాలకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిచుకుని అమలు చేయాలని కోరారు.
మిషన్ భగీరథ పనులపై ప్రగతి భవన్ లో సిఎం ఆదివారం సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా, సెగ్మెంట్ల వారీగా పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపిలు గుత్తా సుఖేందర్ రెడ్డి, మల్లారెడ్డి, నల్లా మల్లారెడ్డి, సిఎం కార్యదర్శి స్మితా సభర్వాల్, ఆర్.డబ్ల్యు.ఎస్. ఇ ఎన్ సి సురేందర్ రెడ్డి, సలహాదారు జ్ఞానేశ్వర్, సిఇలు, ఇతర ఉన్నతాధికారులు, వర్కింగ్ ఏజన్సీల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు.
‘‘మిషన్ భగీరథలో ప్రధానమైన పనులు పూర్తయ్యాయి. ఇన్ టేక్ వెల్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, పైపులైన్లు, పంపుసెట్లతో కూడిన మెయిన్ గ్రిడ్ పనులు 95 శాతం పూర్తయ్యాయి. గ్రామాల్లో అంతర్గత పనులు పురోగతిలో ఉన్నాయి. మొత్తంగా ప్రాజెక్టు పనిలో 75 శాతం పూర్తయింది. ఇప్పటికే చాలా గ్రామాలకు నీరు అందుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో ఇంటింటికి నల్లా ద్వారా కూడా నీరందిస్తున్నారు. వచ్చే నెల చివరి నాటికి ప్రతీ గ్రామానికి నీరు (బల్క్ సప్లయి) అందాలి. బల్క్ సప్లయి చేసే సందర్భంలో తలెత్తే సమస్యలను జూన్ 10 నాటికి పరిష్కరించాలి. గ్రామాల్లో అంతర్గత పనులను కూడా సమాంతరంగా నిర్వహించాలి. దసరా నాటికి అంతర్గత పనులు పూర్తి చేయాలనే గడువు విధించుకుని యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలి.
గ్రామాల్లో వేయడానికి కావాల్సిన పైపులైన్లు, నల్లా పైపులు, నల్లాలు, ఇతర పరికాలను ముందే సేకరించి పెట్టుకోవాలి. దసరా నాటికి పనులు పూర్తి చేసి, ఏమైనా సమస్యలు తలెత్తితే వాటిని పరిష్కరించుకుంటూ పోవాలి. మొత్తంగా డిసెంబర్ నెలాఖరు నాటికి వందకు వంద శాతం మిషన్ భగీరథ ప్రాజెక్టు పూర్తయి, అన్ని గ్రామాల్లోని అన్ని ఇండ్లకు స్వచ్ఛమైన మంచినీరు చేరాలి. దీని ద్వారా వచ్చే ఎన్నికల లోపు ప్రతీ ఇంటికి నల్లా ద్వారా స్వచ్ఛమైన మంచినీరు అందివ్వకుంటే ఓట్లు అడగం అని తీసుకున్న సవాల్ ను విజయవంతంగా అమలు చేసిన వారమవుతాం. అంతకు మించి ప్రతీరోజు ప్రతీ ఇంటికి మంచినీళ్లు అందించి ప్రజల ఆరోగ్యాలు కాపాడిన వారమవుతాం’’ అని ముఖ్యమంత్రి వివరించారు.
‘‘నల్లగొండ జిల్లాలోని మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల్లో ఫ్లోరైడ్ సమస్య ఉంది. ఆ ప్రాతాలకు సురక్షిత మంచినీరు అందించి ప్రజల ఆరోగ్యం కాపాడాలి. ఆ నియోజకవర్గాలకు ముందు నీరివ్వడం ప్రాధాన్యంగా పెట్టుకోవాలి. వీలైనంత త్వరగా గ్రామాల్లో అంతర్గత పనులు పూర్తి చేయాలి. ఏజన్సీ ప్రాంతాలు, మారుమూల పల్లెలు ఎక్కువగా ఉండే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, మహబూబాబాద్ లాంటి జిల్లాలకు ప్రత్యేక వ్యూహం రూపొందించుకోవాలి. అక్కడ పనులు చేయడానికి కూలీలు దొరకరు. మెటీరియల్ సరఫరా చేయడం కూడా కష్టం. కాబట్టి అక్కడ పనులు చేసే వారికి అదనపు ప్రోత్సాహకాలు కూడ అందించే అవకాశం పరిశీలించాలి. చెంచుగూడేలు ఎక్కువగా ఉండే అచ్చంపేట లాంటి నియోజకవర్గాలతో పాటు, పది పదిహేను నివాస ప్రాంతాలుండే అటవీ ఆవాస ప్రాంతాలకు కూడా మంచినీరు అందివ్వాలి. స్థానిక వనరులను గుర్తించి, ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసి వారికి సురక్షిత మంచినీరు అందించే బాధ్యతను స్వీకరించాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.
‘‘మిషన్ భగీరథ కార్యక్రమం అసాధారణమైనది. ఇప్పుడు యావత్ దేశం ఈ కార్యక్రమంపై ఆసక్తి కనబరుస్తున్నది. జాతీయ పార్టీలు కూడా దేశానికంతా తాగునీరు అందించే కార్యక్రమం చేపట్టాలని ఆలోచిస్తున్నాయి. చాలా రాష్ట్రాలు మన పథకాన్ని అధ్యయనం చేసి, తమ రాష్ట్రాల్లో అమలు చేయడానికి సన్నద్ధం అవుతున్నాయి. వారందరికీ మనమే ఆదర్శం. పథకానికి అద్భుతంగా రూపకల్పన చేసి, విజయవంతంగా అమలు చేసి మన సాంకేతిక సహకారం వారికి అవసరం. రేపే దేశానికి మంచినీళ్లు తాపించే పథకానికి కూడ మనమే మార్గదర్శకం వహించబోతున్నాం’’ అని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రాజెక్టు పూర్తి చేయడంతో పాటు దాన్ని ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహించడం కూడా చాలా ముఖ్యమని సిఎం అన్నారు. ప్రాజెక్టును నిర్వహించడానికి అవసరమైన కార్యాచరణను కూడా అధికారులు రూపొందించాలని సిఎం సూచించారు.