పట్టాదారు పాస్‌పుస్తకాలు, రైతు బంధు చెక్కుల పంపిణీపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కలెక్టర్లతో సమావేశమై చర్చించారు.ఈ సమావేశంలో పాస్ బుక్స్ పంపిణీ, చెక్కుల పంపిణీ నిర్వహణపై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా కొత్త పట్టాదారు పాస్ బుక్స్‌ను సీఎం కేసీఆర్ విడుదల చేశారు.పట్టాదారులైన రైతులందరికీ కొత్త పాస్ పుస్తకాలు, రైతుబంధు చెక్కులు పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. అసైన్డ్ భూముల లబ్దిదారులు, ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాదారులు, ఏజెన్సీలో వ్యవసాయం చేసే గిరిజనేతరులతో సహా పట్టాదారులైన రైతులందరికీ కొత్త పాస్ పుస్తకాలు, పంట పెట్టుబడి మద్దతు పథకం కింద ఆర్థిక సహాయం అందించే చెక్కులను పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
ఈ నెలాఖరుకు 58 లక్షల పాస్ పుస్తకాలు, చెక్కుల ముద్రణ పూర్తవుతుందని సీఎం స్పష్టం చేశారు. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఇలాంటి భారాన్ని ఎవరూ ఎత్తుకోలేదని సీఎం తెలిపారు. గతంలో ఎప్పుడూ లేని కార్యక్రమాలను మనమే రచించుకొని అమలు చేస్తున్నామని చెప్పారు.పాస్‌బుక్స్ పంపిణీకి రాష్ట్ర వ్యాప్తంగా 2762 బృందాలు ఏర్పాటు చేశామని.. ఒక్కో బృందం 300 పాస్ పుస్తకాల చొప్పున పంపిణీ చేస్తుందని సీఎం వెల్లడించారు.రైతులకు వెంటనే నగదు చెల్లించకపోతే బ్యాంకులపై చర్యలు తీసుకుంటామన్నారు.గ్రామాల్లోని పాఠశాలల్లో చెక్కులు, పాస్‌బుక్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టాలని సూచించారు. ఏ గ్రామంలో ఎప్పుడు పంపిణీ ఉంటుందో ప్రజలకు ముందే సమాచారం ఇవ్వాలని సూచించారు. రూ. 50 వేల కంటే ఎక్కువ ఉన్న వారికి రెండు చెక్కులు ఇవ్వాల్సి ఉంటుందని కేసీఆర్ తెలిపారు.