తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్వహించిన అయుత చండీయాగం అత్యంత శక్తిమంతమైనదని త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్‌కుమార్ దేవ్ పేర్కొన్నారు. ఈ యాగం నిర్వహించిన సీఎం కేసీఆర్ ఎప్పటికీ అధికారంలో ఉంటారని చెప్పారు. తాను కూడా త్రిపురలో అయుత చండీయాగం చేయనున్నట్టు తెలిపారు. బీసీ సంక్షేమ పథకాలపై అధ్యయనం చేసేందుకు త్రిపుర పర్యటనలో ఉన్న రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగురామన్న మంగళవారం త్రిపు ర సచివాలయంలో బిప్లవ్‌కుమార్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాల గురించి త్రిపుర సీఎం ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో ప్రజా సంక్షేమం పట్ల ప్రభుత్వం పనిచేస్తున్న తీరును ఆయన అభినందించారు. ముఖ్యంగా హరితహారం చాలా గొప్ప పథకమని, 230 కోట్ల మొక్కలు నాటాలన్న ఆలోచన, ఆచరణ.. సీఎం కేసీఆర్ సంకల్పానికి నిదర్శనమని త్రిపుర సీఎం పేర్కొన్నారు.
తెలంగాణలో అమలవుతున్న పథకాల గురించి మంత్రి జోగురామన్న త్రిపుర సీఎంకు వివరించగా, ఆయన అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. వెదురు పరిశ్రమపై తెలంగాణతో త్వరలోనే అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకుంటామని త్రిపుర సీఎం హామీ ఇచ్చారు. త్వరలోనే తెలంగాణలో పర్యటిస్తానని చెప్పారు. త్రిపుర సీఎంను కలిసినవారిలో ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, సీఈవో అలోక్‌కుమార్, పీసీసీఎఫ్ ప్రశాంత్‌కుమార్ ఝూ, త్రిపుర సీఎస్ సంజీవ్‌రంజన్, మేదర సంఘ ప్రతినిధులు బాలరాజ్, వెంకటరాముడు, శ్రీనివాస్, దేవేందర్ తదితరులున్నారు.