ఏపీ సీఎం చంద్రబాబు ఇంట్లో కాదు జైల్లో ఉండేందుకే అర్హుడని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పద్మజ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా గాంధీ సిద్ధాంతాలను అనుసరిస్తూ తూ.చ. తప్పకుండా పాటిస్తుంటే ఆరోజున కూడా అబద్ధాల్లో అంతులేకుండా మాట్లాడి చంద్రబాబు గిన్నిస్ బుక్ రికార్డుకెక్కుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. గాంధీ జయంతి రోజు లక్ష ఇళ్లకు గృహ ప్రవేశాలని చంద్రబాబు చెప్పడాన్ని దుయ్యబట్టారు. ఆమె తన సొంత ఐదారు నివా సాలకు, గెస్ట్ హౌస్‌లకు మరమ్మతుల పేరుతో వందలకోట్ల ప్రభుత్వ, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారే తప్ప బాబు పేదవాడికి ఒక్క ఇళ్లు కట్టించిన పాపాన పోలేదన్నారు. చంద్రబాబు ఇంటికి ప్రజాధనంతో వందల కోట్లు ఖర్చుపెట్టి అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు చేసుకుని.. మీడియాను కూడా ఆ ఇంట్లోకి అనుమతించలేదన్నారు.
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో 48 లక్షల ఇళ్లు కట్టించారని.. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోనే 27 లక్షల వరకు నిర్మించారని పద్మజ గుర్తుచేశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని లక్షల ఇళ్లు కట్టించలేదన్నారు. ఏడాదికి 10వేల ఇళ్లు కూడా కట్టలేని దౌర్భాగ్యపు స్థితిలో ఉన్న చంద్రబాబు.. రాబోయే ఏడాదిలో 17లక్షల ఇళ్లు కడతానని చెప్పడం పచ్చి మోసం, దగాయేనని చెప్పారు. ఎన్నికల కోసం బాబు మళ్లీ అబద్ధాలు మొదలుపెట్టాడన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీనైనా నెరవేర్చారా? ఎందుకు పదే పదే అబద్ధాలతో ప్రజలను మోసగిస్తున్నారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. 3సెంట్ల భూమిలో లక్షన్నర ఇళ్లు కట్టిస్తానని చెప్పిన ఈ పెద్ద మనిషి అధికారంలోకి వచ్చి నాలుగేళ్లవుతున్నా దాని ఊసేలేకపోగా.. నిర్మాణంలో ఉన్న వాటిని కూడా అపేసిన ఘనుడు చంద్రబాబు అని విమర్శించారు. ఏడాదికి 5లక్షల పైచిలుకు పేదల ఇళ్ల నిర్మాణం చేపట్టిన వైఎస్ఆర్ పాలనకు, కేవలం 10వేల ఇళ్లు కూడా చేపట్టని బాబు పాలనకు వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తిస్తున్నారని చెప్పారు.
ఓటుకు నోటు కేసు తర్వాత చంద్రబాబు విజయవాడలో కృష్ణానది ఒడ్డున అక్రమ నిర్మాణంలో నివాసముంటూ నదీ పరిరక్షణ చట్టాలను ఉల్లాంఘించారని పేర్కొన్నారు. కోర్టు నోటీసులు అందుకున్నాక సమాధానం దాటవేశారన్నారు. బాబు ఇళ్లపై, ప్రజాధనం దుర్వినియోగంపై విచారణ చేపడితే ఆయన బండారం బయటపడుతుందన్నారు. ఏ ఇంట్లో ఉండేందుకు చంద్రబాబు అర్హుడు కాదని, జైలులో ఉండేందుకే ఆయన అర్హుడని పద్మజ విమర్శించారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు ఏపీ ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారని పద్మజ స్పష్టం చేశారు. గాంధీ జయంతి రోజు 17 లక్షల ఇళ్లు కడతానని చంద్రబాబు చేసిన వ్యాఖ్యల మీద ఏపీలో సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతుంది. ఈ మూడున్నరేళ్లలో పట్టుమని మూడున్నర వేల ఇండ్లు కూడా కట్టించని చంద్రబాబు ఏడాది కల్లా 17 లక్షల ఇళ్లు కడతానని ప్రగల్బాలు పలుకుతున్నారని ప్రజలు భావిస్తున్నారు..ఈ మేరకు వైసీపీ అధికార ప్రతినిధి పద్మజ చంద్రబాబు అబద్ధాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.