రైతుబంధు పథకం ద్వారా రైతులకు పంట పెట్టుబడికి మద్దతుగా ఎకరానికి 8వేల చొప్పున చేసే ఆర్థిక సహాయపు మొదటి విడత చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని వచ్చే నెల 10న ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. చెక్కులతో పాటు పాస్ పుస్తకాలను కూడా పంపిణీ చేసే సప్తాహ కార్యక్రమం అదే రోజు ప్రారంభించి, రోజుకొక గ్రామం చొప్పున అన్ని గ్రామాల్లో రైతులకు అందివ్వాలని సిఎం అధికారులను ఆదేశించారు. మొదటి విడతగా వర్షాకాలపు పంటకోసం ఎకరానికి 4వేల చొప్పున, రెండో విడతగా ఎండాకాలపు పంట కోసం ఎకరానికి మరో నాలుగువేలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయాన్ని సిఎంగ గుర్తు చేశారు. మొదటి విడత వర్షాకాలపు పంట పెట్టుబడి మద్దతు కింద ఎకరానికి 4వేల చొప్పున చెక్కుల రూపంలో అందివ్వనున్నట్లు వెల్లడించారు. చెక్కులిచ్చిన రైతులకు నగదు ఇవ్వడానికి వీలుగా బ్యాంకుల్లో కావాల్సిన నిల్వలు ఉంచడానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని సిఎం చెప్పారు. 58 లక్షల పాస్ పుస్తకాల పంపిణీ, చెక్కుల పంపిణీ కార్యాచరణను రూపొందించేందుకు ఈ నెల 21న ప్రగతి భవన్ లో కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసినట్లు సిఎం తెలిపారు.
పాస్ పుస్తకాలు, చెక్కుల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి మంగళవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మంత్రులు టి.హరీశ్ రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జి.జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి జనార్థన్ రెడ్డి, బి. గణేష్ గుప్తా, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు నర్సింగ్ రావు, పార్థసారథి, రాజేశ్వర్ తివారి, వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్ మోహన్, భూ పరిపాలన విభాగం డైరెక్టర్ వాకాటి కరుణ, ఐటి డైరెక్టర్ వెంకటేశ్వర్ రావు, సిఎం కార్యదర్శి స్మితా సభర్వాల్ తదితరులు పాల్గొన్నారు. చెక్కులు, పాస్ పుస్తకాల పంపిణీకి సంబంధించిన కార్యాచరణను ఈ సమావేశంలో ఖరారు చేశారు.
• 58 లక్షలు : పంపిణీ చేయాల్సిన పాస్ పుస్తకాలు, చెక్కులు
• 8,25,571 : ప్రతీ రోజు పంపిణీ చేయాల్సిన పాస్ పుస్తకాలు, చెక్కులు
• 2,761 : ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాటయ్యే బృందాలు
• 300 : ఒక్కో బృందం ఒక్కో రోజు జారీ చేసే పాస్ పుస్తకాలు, చెక్కులు
• 10,323 : పంపిణీ కార్యక్రమం జగిగే మొత్తం గ్రామాలు
• 1,546 : ఒక్కో రోజు పంపిణీ కార్యక్రమం జరిగే గ్రామాలు- రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటయ్యే 2,762 బృందాలు ఒక్కో రోజు 1,546 గ్రామాల్లో పాస్ పుస్తకాలు, చెక్కులు పంపిణీ చేస్తాయి.
– మే 10న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు
– రెవెన్యూ శాఖను నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్మోహన్, భూ పరిపాలన శాఖ డైరెక్టర్ వాకాటి కరుణతో కూడిన బృందం ప్రతీ రోజు నాలుగైదు జిల్లాల చొప్పున పర్యటించి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తుంది.
– పాస్ పుస్తకాలు, చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో కలెక్టర్లు పర్యవేక్షిస్తారు. పాస్ పుస్తకాలు, చెక్కులను ఆయా గ్రామాలకు చేర్చడంతో పాటు, అధికార బృందాలను ఏర్పాటు చేస్తారు.
– కలెక్టర్లకు ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించడానికి ఈ నెల 21న హైదరాబాద్ ప్రగతి భవన్ లో ప్రత్యేక సమావేశం జరుగుతుంది. రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు కలెక్టర్లకు కార్యక్రమ నిర్వహణ గురించి వివరిస్తారు. ఈ సమావేశానికి జాయింట్ కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులను కూడా ఆహ్వానించారు.
– ఏ గ్రామంలో ఏ రోజు ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహించాలో కలెక్టర్లు నిర్ణయిస్తారు. ఈ విషయాన్ని పత్రికా ప్రకటనల ద్వారా, ఇతర ప్రచార సాధనాల ద్వారా, డప్పు చాటింపు ద్వారా, ఫ్లెక్సీలు, ఇతర మార్గాల ద్వారా ప్రజలకు తెలుపుతారు.
– ఆయా గ్రామాల పాస్ పుస్తకాల సంఖ్య ఆధారంగా ఏ గ్రామానికి ఎన్ని అధికారుల బృందాలను పంపాలనే విషయంలో కూడా కలెక్టర్లు నిర్ణయం తీసుకుంటారు. 300 పాస్ పుస్తాలకు ఒకటి చొప్పున బృందాన్ని నియమించి, ఒకే రోజులో అందరికీ పంపిణీ చేస్తారు.
– రైతులకు పాస్ పుస్తకం, చెక్కులు ఇచ్చి వారి సంతకాలు తీసుకుంటారు.
– ఆ రోజు గ్రామంలో రైతులు లేకుంటే తర్వాత వాటిని మండల కార్యాలయంలో మూడు నెలల వరకు అందుబాటులో ఉంచి, అందిస్తారు.
దేశంలో మరెక్కడా లేని విధంగా రైతులకు పంట పెట్టుబడి కోసం ఎకరానికి 8 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని అత్యంత చిత్తశుద్దితో, ఎక్కడా పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను కోరారు. రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఎంతో శ్రమకోర్చి 100 రోజుల పాటు గ్రామాల్లో పర్యటించి, భూ రికార్డుల సమగ్ర ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టారని, దాని ఆధారంగా వచ్చిన వివరాలతో పాస్ పుస్తకాలు రూపొందించారని సిఎం చెప్పారు. అలా రూపొందించిన పాస్ పుస్తకాలను రైతులకు అందించడంతో భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమానికి సార్థకత చేకూరుతుందని సిఎం అన్నారు. అన్ని భూ వివరాలతో ‘ధరణి’ వెబ్ సైట్ కూడా త్వరలోనే అందుబుటలోకి వస్తుందన్నారు.
‘‘రైతులు వ్యవసాయ పెట్టుబడి కోసం ప్రతీ ఏటా ఎన్నో అగచాట్లు పడతారు. అప్పు కోసం ఎన్నో తిప్పలు పడతారు. ఏ కారణంత చేతనైనా పంట చేతికి రాకపోతే పెట్టిన పెట్టుబడి నష్టపోతారు. దీంతో ఆర్థికంగా మరింత కృంగిపోతారు. ఈ పరిస్థితి నివారించడానికి, ఆర్థికంగా భారమైనప్పటికీ రైతులకు పంట పెట్టుబడి అందివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వర్షాకాలం పంట సీజన్ ప్రారంభం కాకముందే ప్రభుత్వం అందించే సాయం వారి చేతిలో ఉండాలి. అప్పుడే రైతులు అప్పులు చేయాల్సిన పరిస్థితి రాదు. కాబట్టి ప్రభుత్వ ఉద్దేశ్యాన్ని, రైతుల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని అధికార యంత్రాంగం కష్టపడి పాస్ పుస్తకాలు, చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి’’ అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
త్వరలోనే కంటి వైద్య శిబిరాలు
పాస్ పుస్తకాలు, చెక్కుల పంపిణీ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత కంటి వైద్య పరీక్షల శిబిరాలు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ఈ కార్యక్రమం నిర్వహణకు అవసరమైన కార్యాచరణను వైద్య, ఆరోగ్య శాఖ రూపొందిస్తున్నదని సిఎం చెప్పారు. ఈ కార్యక్రమాన్ని కూడా అధికార యంత్రాంగం విజయవంతం చేయాలని సిఎం చెప్పారు.