ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ముగించుకుని శనివారం కృష్ణా జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చింది. కాగా, వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రను ప్రస్తుతం విజయవాడలో కొనసాగిస్తున్నారు. 136 రోజులు పూర్తి చేసుకుని 137వ రోజు విజయవాడలో పాదయాత్ర చేస్తున్న జగన్‌కు ఆర్టీసీలోని అన్ని కార్మిక యూనియన్లు నీరాజనాలు పలికారు. జగన్‌ను కలిసిన ఆర్టీసీ అన్ని యూనియన్ల కార్మికులు వారి సమస్యలను చెప్పుకున్నారు. చంద్రబాబు నాయుడు 2014లో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను నమ్మి మోసపోయామన్నారు. నాడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి వెంటిలేటర్‌పై ఉన్న ఆర్టీసీకి ఆక్సిజన్ ఇచ్చి కాపాడితే.. నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్టీసీని మళ్లీ వెంటిలేటర్‌పై పడుకోబెట్టారని ఆవేదన చెందారు ఆర్టీసీ కార్మికులు.
నాడు ఎన్టీఆర్ పోరాటం చూశా.. నేడు జగన్ పోరాటం చూస్తున్నా..! హ్యాట్యాఫ్..!!
ఈ సందర్భంగా ఆర్టీసీ మహిళా కార్మికురాలు మీడియాతో మాట్లాడుతూ.. జగన్ మోహన్‌రెడ్డి ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనం చేస్తానని హామీ ఇచ్చారని, మాట ఇస్తే.. దాన్ని సాధించడం ఎంత కష్టమైనా సరే.. పోరాడే తత్వం జగన్ మోహన్‌రెడ్డిది అని, ఆ నేపథ్యంలోనే జగన్ ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తారన్న నమ్మకం తమకు ఉందన్నారు. అలాగే, ఆర్టీసీలో పీఆర్సీ విధానాన్ని అమలు చేయాలని జగన్‌ను కోరినట్లు తెలిపింది ఆ మహిళ. వెంటిలేటర్‌పై ఉన్న ఆర్టీసీకి ఆక్సిజన్ ఇచ్చి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎలా అయితే, కాపాడారో.. ఇప్పుడు చంద్రబాబు పాలనలో వెంటిలేటర్‌పై ఉన్న ఆర్టీసీకి జగన్ సీఎం అయ్యాక ఆక్సిజన్ అందిస్తాడనే నమ్మకం మాకుందని, అందుకే 2019 ఎన్నికల్లో జగన్‌ను సీఎం చేసేందుకు ఆర్టీసీ యూనియన్లన్నీ కలిసి పనిచేస్తున్నాయని మీడియాకు వెల్లడించాయి ఆర్టీసీ కార్మిక యూనియన్లు.