మాజీ ప్రధాని, జనతాదళ్ (లౌకిక) పార్టీ జాతీయాధ్యక్షుడు హెచ్‌డీ దేవెగౌడతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం బెంగళూరులో భేటీ అయ్యారు. జాతీయ స్థాయిలో గుణాత్మక మార్పు కోసం తాను ప్రతిపాదించిన కొత్త రాజకీయ కూటమి ఏర్పాటుపై దేవెగౌడతో సీఎం కేసీఆర్ చర్చిస్తున్నారు. అంతకుముందు తన నివాసానికి చేరుకున్న సీఎం కేసీఆర్‌కు దేవెగౌడ సాదరంగా ఆహ్వానం పలికారు. సీఎం కేసీఆర్ వెంట ఎంపీలు వినోద్, సంతోష్, నటుడు ప్రకాశ్‌రాజ్ ఉన్నారు. ఈ పర్యటనలో ఆయన మాజీ సీఎం, జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామితోనూ భేటీ కానున్నారు.
కాంగ్రెస్, భాజపాలకు ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు చేపట్టిన కేసీఆర్ ఇప్పటికే కోల్‌కతాలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీని కలిసి దీనిపై చర్చించారు. ఆ తర్వాత ఝూర్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ హైదరాబాద్‌కు వచ్చి కేసీఆర్‌ను కలిసి దీనిపై మాట్లాడారు. తాజాగా సుదీర్ఘ రాజకీయ అనుభవం గల దేవెగౌడతో సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. జనతాదళ్-ఎస్.. భాజపా, కాంగ్రెస్‌లకు దూరంగా ఉంటోంది. కర్ణాటకలో జరగనున్న ఎన్నికల్లోనూ విడిగా పోటీ చేస్తోంది. తమ లక్ష్యాలకు అనుగుణంగా జేడీఎస్ పనిచేస్తున్నందున దేవెగౌడను కలిసి కొత్త కూటమిపై చర్చించాలని కేసీఆర్ భావించారు.