ఎర్కపోయి వచ్చాము.. ఇరుక్కు పోయాము అన్నట్లుగా ఉంది టీడీపీలో ఆనం సోదరుల పరిస్థితి. కాంగ్రెస్‌లో వున్నప్పుడు హైమాక్స్ లైట్లు లాగా ధగధగా వెలిగారు. టీడీపీలోకి వచ్చాక కిరోసిన్ దీపాల్లా మారి పోయారు. బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవుతాయన్న సామెత ఇపుడు వీరికి సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే, పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన సోదరులు ఓడిపోయారు. తర్వాత టీడీపీలో చేరారు. అప్పటి నుండే వాళ్ళకు కష్టాలు మొదలయ్యాయి. వైసీపీలో చేరేందుకు చేసిన ప్రయత్నాలు కలిసిరాలేదు. దాంతో టీడీపీలో చేరాల్సి వచ్చింది. పచ్చ కండువా కప్పేముందు రామనారాయణరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. చంద్రబాబు హామీని చూసుకుని జగన్ పై ఎగిరెగిరి పడ్డారు. జగన్ పైన వివేకానందరెడ్డి చాలా నీచమైన వ్యాఖ్యలే చేసారు.
అయితే కొంత కాలం తర్వాత వీరిద్దరినీ చంద్రబాబు పూర్తిగా దూరం పెట్టేసారు. దాంతో అప్పటి నుండి ఏం చేయాలో దిక్కుతోచటం లేదు. అదే సమయంలో జిల్లాలో కూడా టీడీపీ నేతలనుండి వీరికి అవమానాలే ఎదురౌతున్నాయి. అందుకని జిల్లాలోనూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనటం లేదు. ఇక రాజకీయ పునరా వాసం కోసమే వాళ్ళు టీడీపీలో చేరారు. ఆరోజుకు వాళ్లు వైసిపిలో చేరే పరిస్థితి లేదు. ఎందుకంటే కాంగ్రెస్‌లో వున్నప్పుడు జగన్‌ను వాళ్లు అట్లా ఇట్లా తిట్టలేదు. రాజకీయ విమర్శలు చేస్తే ఫర్వాలేదు. వీళ్ళు హద్దులు దాటి వ్యక్తి గతంగా కూడా విమర్శలు చేశారు. దానివల్లే వీళ్ళు వైసీపీ వైపు చూసే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఇద్దరు బ్రదర్స్‌కు మనశ్శాంతి కరువైంది. టీడీపీలో సరైన ప్రాధాన్యత లేదు. ఆనం రామనారాయణరెడ్డికి ఆత్మకూరు ఇన్‌ఛార్జి బాధ్యత ఇవ్వడం తప్పించి ఇంకేమీ పదవులు లేవు. ఆనం వివేకాకు ఎమ్మెల్సీ ఇస్తామన్న హామీ గాలికి కొట్టుకుపోయింది. అదంతా పక్కనపెడితే ఒకప్పుడు జిల్లాలో వీళ్లు ఏనుగులు లాగా పోతుంటే నక్కి నక్కి చూసిన ఎలుకల్లాంటి నాయకులు కూడా ఇప్పుడు వాళ్ల ముందుకు వచ్చి తోక చూపిస్తున్నారు. ఈ పరిణామాలను జీర్ణించుకోవడం వారికి కష్టమే.. ఇక వాళ్ళు టీడీపీలో ఎక్కువరోజులు కొనసాగే పరిస్థితులు కనిపించడం లేదు.