భారతదేశ కీర్తి పతాక మరోసారి గగనంలో రెపరెపలాడింది.దేశీయ దిక్సూచి వ్యవస్థ కోసం రూపొందించిన ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ – సీ 41 రాకెట్ ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నింగిలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది.శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి గురువారం ఉదయం 4.04 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. మంగళవారం రాత్రి వేల ప్రారంభమైన 32గంటల కౌంట్ డౌన్ అనంతరం షార్ లోని మొదటి లాంచింగ్ ప్యాడ్ నుండి ప్రయోగించిన రాకెట్ 19.19 నిమిషాల వ్యవధిలో తన లక్ష్యాన్ని చేరుకుంది. ఇప్పటి వరకు ఇస్రో మొత్తం 8 నావిగేషన్ శాటిలైట్లను నింగిలోకి పంపింది. ఇందులో గతేడాది ఆగస్టు 31న పంపిన ఐఆర్ఎన్ఎస్ఎస్-1హెచ్ ఉపగ్రహం ఉష్ణ కవచం తెరుచుకోకపోవడంతో బయటకు రాలేదు. దాంతో విఫలమైనట్లు ఇస్రో ప్రకటించింది. దాని స్థానంలో ఇవాళ ఉదయం ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఐ ఉపగ్రహాన్ని పంపారు.
