తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కులాల వృత్తిదారులకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో శాశ్వతంగా ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు బీసీ సంక్షేమం, అటవీ శాఖల మంత్రి జోగు రామన్న వెల్లడించారు. ఆదివారం సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ తో కలిసి ఇటీవల గుజరాత్ రాష్ర్ట పర్యటన వివరాలను ఆయన తెలిపారు. గుజరాత్ పర్యటన అనంతరం రాష్ట్ర ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాలను మంత్రి జోగు రామన్న వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి కుల వృత్తిదారునికి ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కులాల వారీగా ప్రతి ఒక్కరిని ఆర్థికంగా అభివృద్ధి చేయడం కోసం చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కుల వృత్తులన్నింటికి పూర్వ వైభవం తీసుకుని రావడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా, ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతున్నట్లు ఆయన తెలిపారు. అందులో భాగంగానే కుల వృత్తిదారులకు ప్రత్యేక శిక్షణ కోసం హైదరాబాద్లో శాశ్వతంగా శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి జోగు రామన్న ప్రకటించారు.
Tags CM KCR Govt Of Telangana jogu ramanna